Pawan Kalyan: జగన్... కర్నూలు జిల్లా వెళ్లి చూడు... కొణిదెల గ్రామం ఉంటుంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan says to Jagan there is Konidela village in Kurnool district
  • రైల్వేకోడూరులో కూటమి ఎన్నికల ప్రచార సభ
  • ఆవేశపూరితంగా ప్రసంగించిన పవన్ కల్యాణ్
  • జగన్... రాయలసీమపై నీ గుత్తాధిపత్యం ఏమిటంటూ ఫైర్
  • మిథున్ రెడ్డీ... పిఠాపురంలో నీకేంటి పని? అంటూ ఆగ్రహం
  • యువత ధైర్యం పుంజుకోవాలని పిలుపు
  • రాయలసీమ పౌరుషం ఏమైపోయిందంటూ వ్యాఖ్యలు

రాష్ట్రంలో యువత మార్పు కోరుకుంటోందని, అందరూ మార్పు కోరుకుంటున్నారన్న విషయాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే తాను గ్రహించానని రైల్వే కోడూరు సభలో జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రజలు తప్పుచేశారన్న విషయం వైసీపీ వచ్చిన రోజునే అర్థమైందని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీకోసం పోరాడుతూనే ఉన్నానని వెల్లడించారు. 

పార్టీ నడపడం చేతకాదని అన్నారని, కానీ అది తప్పని దశాబ్దకాలం నుంచి నిరూపిస్తూనే ఉన్నానని స్పష్టం చేశారు. కష్టాలు మనకి, బలిదానాలు, త్యాగాలు మనకి... సంపద జగన్ కు, పెద్దిరెడ్డికి, మిథున్ రెడ్డికి అని వ్యాఖ్యానించారు. 

"రాష్ట్రంలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే ఈ పెద్దిరెడ్డికి పట్టదు, ఈ మిథున్ రెడ్డికి పట్టదు, జగన్ కు పట్టదు... వీళ్లకి దోపిడీ తప్ప మరో ధ్యాసలేదు. మిథున్ రెడ్డికి ఒకటే చెబుతున్నా... మిథున్ రెడ్డీ, నీకు పిఠాపురంలో పనేంటి? రాష్ట్రం మీ ఐదుగురిదీ అనుకుంటున్నారా? రాష్ట్రంపై మీ గుత్తాధిపత్యం ఏమిటి? రాజకీయాలు నాకేమీ సరదా కాదు. అడ్డమైన, ప్రతి పనికిమాలిన వెధవతో తిట్టించుకోవడానికి నాకేమీ పౌరుషం లేదనుకుంటున్నారా? 

ఆడవాళ్లకు రక్షణ కోసం, ప్రజల భవిష్యత్తు కోసం, రైతుల క్షేమం కోసం అన్నీ భరిస్తున్నాను. జగన్... రాయలసీమపై నీ గుత్తాధిపత్యం ఏమిటి? రాయలసీమ ఒకరి సొత్తు అనుకుంటున్నావా? కర్నూలు జిల్లా వెళ్లిచూడు... కొణిదెల గ్రామం ఉంటుంది అక్కడ. దమ్ము, ధైర్యం లేవనుకుంటున్నావా మాకు? 

పెద్దిరెడ్డి గారూ... 40 మందిని మర్డర్ చేసి మమ్మల్ని కూడా బెదిరించాలనుకుంటున్నారా? ఎర్రచందనం వీళ్లకు ఇంధనం అయిపోయింది. అడ్డొచ్చిన వాళ్లను నరికేస్తారు, ఆసుపత్రిలో ఇంజక్షన్ ఇచ్చి చంపేస్తారు, కాళ్లు చేతులు తీసేస్తారు. గంగిరెడ్డి ఒక ఎర్రచందనం డాన్, అలిపిరి ఘటనలో నిందితుడు... 2015లో అతడ్ని మారిషస్ లో అరెస్ట్ చేస్తే, ఇప్పుడు అతడు మిథున్ రెడ్డితో తిరుగుతున్నాడు. 

వైసీపీ గూండాలందరికీ రైల్వే కోడూరు నడిబొడ్డులో నిలబడి చెబుతున్నా... సగటు మనిషి హక్కులను కాలరాస్తున్నారు మీరు.. మీ అంతు చూస్తాం, మిమ్మల్ని వీధుల్లోకి లాక్కొస్తాం. యువత తలుచుకుంటే జగన్ రోడ్లపైకి రాగలడా? యువతలో ధైర్యం చచ్చిపోయింది... నేను వచ్చినప్పుడు రోడ్లపైకి రావడం కాదు, అన్యాయం జరిగినప్పుడు రోడ్లపైకి రావాలి. ధైర్యం లేని సమాజం కుళ్లిపోతుంది, చచ్చిపోతుంది! 

ఇది రాయలసీమ... రాయలు ఏలిన సీమ ఇది... ఆ సీమ నుంచి వచ్చిన మీరు భయపడితే ఎలా? భయపడకండి... నేను మీకు అండగా ఉంటా. మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు. 

ఇక్కడ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఉన్నారు, మూడున్నరేళ్లు సీఎంగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కానీ తండ్రి చనిపోయిన రెండో రోజే సీఎం కావాలని కలలు కన్న వ్యక్తి జగన్... జగన్ కు భయపడతారా? జగన్ రక్తమేమైనా బ్లూ కలర్ లో ఉంటుందా? జగన్ ఏమైనా ఆరడుగులు, ఎనిమిదడుగులు ఉండి ఏ దెబ్బ అతడిపై పడదనుకుంటున్నారా? 

మీరు రాయలసీమ అన్నం తింటున్నారా, లేదా? మీరు పెద్దిరెడ్డికి, మిథున్ రెడ్డికి, గంగిరెడ్డి వంటి వాళ్లకు భయపడతారా? మీరేమీ కత్తులు, కర్రలు తీయాల్సిన అవసరం లేదు... ఎన్నికల్లో రాజంపేట అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి కమలం పువ్వు గుర్తుపై ఓటేయండి, రైల్వే కోడూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి అరవ శ్రీధర్ కు గ్లాసు గుర్తుపై ఓటేయండి. 

మేం విజయనగరం వరకు వెళ్లాం. ప్రతి చోటా మార్పు కనిపిస్తోంది. మీరు కూడా ఇక్కడ ధైర్యంగా ఉండాలి. మీరు ఎవరికీ భయపడకుండా ఓటేయండి. మీకు అండగా మేం ఉన్నాం" అంటూ పవన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.

  • Loading...

More Telugu News