Raghunandan Rao: సిద్దిపేట ఈరోజు భయం నుంచి బయటకు వచ్చింది: రఘునందన్ రావు

Raghunandan Rao fires at Harish Rao
  • 1985లో కేసీఆర్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే కుటుంబం సిద్దిపేటను దోచుకుంటోందని ఆరోపణ
  • ధరణి, ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ పదేళ్లు దోచుకుందని ఆగ్రహం
  • ప్రాజెక్టుల కోసం ఊళ్లకు ఊళ్లను బలవంతంగా ఖాళీ చేయించాడంటూ వెంకట్రామిరెడ్డిపై మండిపాటు
సిద్దిపేట ఈరోజు భయం నుంచి బయటకు వచ్చిందని... హరీశ్ రావు అడుగులకు మడుగులొత్తే అధికారులు, పోలీసులు ఇప్పుడు సిద్దిపేటలో లేరని... అందుకే ఎమ్మెల్యే ఎక్కువగా సిద్దిపేటకు రావడం లేదని మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఒకవేళ హరీశ్ రావు వచ్చినా చాటుగా వచ్చి వెళుతున్నారన్నారు. సిద్దిపేటలో బీజేపీ విశాల జనసభలో ఆయన మాట్లాడుతూ... 1985లో కేసీఆర్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే కుటుంబం సిద్దిపేటను దోచుకుంటోందని ఆరోపించారు. అందుకే ఈరోజు సిద్దిపేట గడ్డమీద బీజేపీ కోసం ఇంతమంది కార్యకర్తలు, ప్రజలు వచ్చారన్నారు.

ధరణి, ప్రాజెక్టుల పేరు మీద పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ దోచుకుందని ఆరోపించారు. కలెక్టర్‌గా ఉన్నప్పుడు కేసీఆర్ కాళ్లు మొక్కి ఎమ్మెల్సీ అయిన వెంకట్రామిరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులు కట్టాలని... కానీ రైతులు, ప్రజల ఉసురు తీసుకొని కట్టకూడదన్నారు. మల్లన్నసాగర్ ప్రాంతంలో మల్లారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని... ఇందుకు వెంకట్రామిరెడ్డి కారణమన్నారు. ప్రాజెక్టుల కోసం ఊళ్లకు ఊళ్లను బలవంతంగా ఖాళీ చేయించిన మూర్ఖుడు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని ఆరోపించారు.

వెంకట్రామిరెడ్డి కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని... జిల్లా కలెక్టర్‌గా ఉండి... 2021లో కేసీఆర్ కాళ్లు మొక్కి ఆ తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడన్నారు. నాటి నుంచి ఈ మూడేళ్లలో మెదక్ జిల్లాకు ఆయన ఒక్క రూపాయి ఎందుకు ఖర్చు పెట్టలేదో చెప్పాలన్నారు. ఇటీవల టీవీ9 ఛానల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీకి సున్నా లేదా ఒక సీటు వస్తాయని చెబుతున్నారని... కానీ ఆ ఫలితాలు బీఆర్ఎస్‌కే వస్తాయన్నారు. సిద్దిపేటకు రైల్వే లైన్ ఇచ్చింది ప్రధాని మోదీ అన్నారు. అధికారం పోయాక హరీశ్ రావు సిద్దిపేటకు రావడం లేదని ఎద్దేవా చేశారు.
Raghunandan Rao
BJP
Lok Sabha Polls
Medak District

More Telugu News