Pulivarthi Nani: నామినేషన్ కు వస్తుంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు: పులివర్తి నాని

  • చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులివర్తి నాని
  • నేడు నామినేషన్ దాఖలు
  • రోడ్డు బ్లాక్ చేయడంతో నడుచుకుంటూ వచ్చి నామినేషన్ వేశానన్న నాని
  • భాస్కర్ రెడ్డి కుట్రలకు భయపడే పరిస్థితి లేదని స్పష్టీకరణ
Pulivarthi Nani files nomination in Chandragiri

తిరుపతి జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని నేడు నామినేషన్ దాఖలు చేశారు. చంద్రగిరిలోని శ్రీ నాగాలమ్మ తల్లి ఆలయంలో, శ్రీ మూలస్థాన ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో పులివర్తి నాని, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పులివర్తి నాని నామినేషన్ కు తరలి వెళ్లారు. 

కాగా, తాను నామినేషన్ కు వెళుతుంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని పులివర్తి నాని ఆరోపించారు. రోడ్డు బ్లాక్ చేయడంతో, నడుచుకుని వచ్చి నామినేషన్ వేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఎంత బెదిరించినా భయపడకుండా కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని పులివర్తి నాని పిలుపునిచ్చారు. 

వైసీపీ వాళ్లు రాళ్లు వేస్తే... పోలీసులు తమ వాళ్లను తీసుకెళ్లారని మండిపడ్డారు. భాస్కర్ రెడ్డి కుట్రలకు భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ 15 రోజులు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోమని.. దెబ్బలు తినేందుకు కూడా సిద్ధమేనని నాని ప్రకటించారు. ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.

More Telugu News