Revanth Reddy: హరీశ్ రావు రాజీనామా పత్రాన్ని జేబులో సిద్ధంగా పెట్టుకోవాలి: రేవంత్ రెడ్డి

Revanth Reddy in warangal public meeting
  • రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నానన్న రేవంత్ 
  • పంద్రాగస్ట్ లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి హామీ
  • అసెంబ్లీకి రాని కేసీఆర్ టీవీ స్టూడియోల్లో కూర్చొని గంటలపాటు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శ

హరీశ్ రావు తన రాజీనామా పత్రాన్ని జేబులో సిద్ధంగా పెట్టుకోవాలని... ఎందుకంటే పంద్రాగస్ట్ లోగా తాము రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ మాదిరిగా హరీశ్ రావు మాట తప్పకూడదని సూచించారు. వరంగల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు సవాల్ చేశారని, అందుకే రాజీనామా పత్రం సిద్ధం చేసుకోవాలన్నారు. రామప్ప శివుడి సాక్షిగా, వేయి స్తంభాల గుడి సాక్షిగా, భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాట ఇస్తున్నా...  పంద్రాగస్ట్ లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా... నీ సంగతి తేలుస్తానని హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు.

అసెంబ్లీకి రాని కేసీఆర్ టీవీ స్టూడియోల్లో కూర్చొని గంటలపాటు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. వరంగల్ అంటే దేశానికి తలమానికమైన పీవీ, కాళోజీ, జయశంకర్ సార్ గుర్తుకు వస్తారన్నారు. హైదరాబాద్ మాదిరి వరంగల్‌కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని... విమానాశ్రయం నిర్మిస్తామని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వీర్యమైందని... వీసీతో పాటు బోధనాసిబ్బందిని నియమిస్తామన్నారు.

కేసీఆర్ కట్టిన కాళేశ్వరం అద్భుతమైతే కనుక తనతో చర్చకు సిద్ధం కావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే కాళేశ్వరంపై చర్చకు రావాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితులు లేవన్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే నాయకులు కావాలని వ్యాఖ్యానించారు. ఎంపీ టిక్కెట్ కోసం కడియం శ్రీహరి తమను సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఆయన వద్దకే కాంగ్రెస్ నేతలు వెళ్లారన్నారు. లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారని.. కానీ మేడిగడ్డ మేడిపండు అయింది... సుందిళ్ల సున్నా అయిందని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News