Rajasthan: 'మా పార్టీ గుర్తుకు ఓటు వేయకండి...!' అంటూ సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం

  • రాజస్థాన్‌లోని బన్స్వారా- దుంగార్పూర్ నుంచి అరవింద్ దామెర్‌కు టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్
  • ఆ తర్వాత భారత్ ఆదివాసీ పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయం
  • పోటీ నుంచి తప్పుకోవాలని ఒకరోజు ముందు సొంత పార్టీ అభ్యర్థికి చెప్పిన కాంగ్రెస్
  • ఆ రోజు కనిపించకుండా పోయిన అరవింద్ దామెర్‌
  • నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉంటున్నట్లు ప్రకటన
  • దీంతో సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారం
Congress campaigning against own candidate in Banswara

లోక్ సభ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఆసక్తికర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రచారం నిర్వహిస్తోంది. చేయి గుర్తుకు ఓటు వేయకండని... కాంగ్రెస్ నాయకులే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందుకు ఓ కారణం ఉంది. బన్స్వారా-దుంగార్పూర్ లోక్ సభ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అరవింద్ దామెర్‌ను బరిలోకి దింపింది. బీఫామ్ ఇవ్వడంతో ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు.

కానీ నామినేషన్ల ఉపసంహరణ గడువుకు ఒకరోజు ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ ఆదివాసీ పార్టీ అభ్యర్థి రాజ్ కుమార్ రోట్‌కు మద్దతివ్వాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని పార్టీ అభ్యర్థి అరవింద్ దామెర్‌కు స్పష్టం చేసింది. దీంతో ఆయన పార్టీ పెద్దల వద్ద నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటానని చెప్పారు. కానీ ఆ తర్వాత నుంచి ఉపసంహరణ గడువు ముగిసే వరకు కనిపించకుండా పోయారు.

నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత బయటకు వచ్చిన అరవింద్ మాట్లాడుతూ... తాను పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మద్దతిచ్చిన పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఈ క్రమంలో, ఈ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థికి ఓటు వేయవద్దని... మనం మద్దతిచ్చిన భారత్ ఆదివాసీ పార్టీకి ఓటు వేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తోంది.

More Telugu News