YS Sharmila: ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmila responds to Modi comments over mangalasutra
  • మహిళల మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ వదలిపెట్టదంటూ మోదీ తీవ్ర విమర్శ
  • మతాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ మోదీపై మండిపడ్డ షర్మిల
  • ప్రధానికి దమ్ముంటే తను చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలని సవాల్
  • కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం
దేశ ప్రజల సొమ్మును కాంగ్రెస్ ‘చొరబాటుదార్లకు’ దోచిపెడుతోందంటూ ప్రధాని మోదీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల మంగళసూత్రాలను కూడా హస్తం పార్టీ వదిలిపెట్టట్లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఘాటు విమర్శలు చేశారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పలేకే మోదీ ఇలా కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. 

‘‘ప్రధాని మోదీ దేశంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేక కాంగ్రెస్ పార్టీపై విషం చిమ్ముతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు తెంచుతామట. మతాల మధ్య మళ్ళీ చిచ్చు పెడుతున్నారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ద్వేషం పెంచుతారా? మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు సృష్టించి ఎన్ని మంగళసూత్రాలు తెంచలేదు? ఇప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు మణిపూర్ ఘటనతో ఎన్ని మంగళసూత్రాలు తెంచలేదు? 

రాహుల్ గాంధీ ప్రేమను నింపే మాటలు మాట్లాడుతున్నారు. మోదీ మాత్రం మతాలను విడదీసి మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీకి దమ్ముంటే చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి. ముస్లింలను కించపరిచేలా మాట్లాడటం సరికాదు. ఇది బీజేపీకి, ఈ దేశానికి మంచిది కాదు. బీజేపీ ఈ దేశానికి చాలా ప్రమాదకరం. కాంగ్రెస్ పార్టీతోనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాస్వామ్యానికి రక్షణ’’ అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
YS Sharmila
Congress
Narendra Modi
Minorities
Lok Sabha Polls
BJP

More Telugu News