Rahul Gandhi: అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్య... రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు విచారణ వాయిదా

  • 2018లో నాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షాపై రాహుల్ గాంధీ విమర్శలు
  • పరువు నష్టం కేసు దాఖలు చేసిన బీజేపీ నేత విజయ్ మిశ్రా
  • కోర్టుకు న్యాయమూర్తిని కేటాయించకపోవడంతో మే 2కు వాయిదా
Hearing in 2018 defamation case against Rahul Gandhi postponed to May 2

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై 2018లో దాఖలైన పరువునష్టం కేసు విచారణను ఉత్తర ప్రదేశ్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణ సోమవారం జరగాల్సి ఉందని, కానీ ఈ కోర్టుకు ఇంకా న్యాయమూర్తిని కేటాయించనందున విచారణ వాయిదా పడిందని రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది కాశీప్రసాద్ శుక్లా వెల్లడించారు. 

ఆరేళ్ల క్రితం బీజేపీ నేత విజయ్ మిశ్రా... రాహుల్ గాంధీపై పరువునష్టం దావా వేశారు. గత ఏడాది డిసెంబర్‌లో రాహుల్ గాంధీపై కోర్టు వారెంట్ జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20న అమేథీలో తన భారత్ జోడో న్యాయ్ యాత్రకు విరామం ఇచ్చిన రాహుల్ గాంధీ కోర్టుకు హాజరై బెయిల్ పొందారు.

2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బెంగళూరులో విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ... అమిత్ షాపై విమర్శలు చేశారు. దీంతో అగస్ట్ 4, 2018లో ఫిర్యాదు చేశారు. నిజాయతీకి, స్వచ్ఛమైన రాజకీయాలకు నిదర్శనం తామేనని బీజేపీ చెప్పుకుంటుందని... కానీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వారు ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని రాహుల్ గాంధీ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఫిర్యాదుదారు విజయ్ మిశ్రా ప్రస్తావించారు. ఆ సమయంలో అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2005లో గుజరాత్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాకు అంతకుముందే ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.

More Telugu News