Harish Rao: అలా చేయకపోతే రాజీనామా చేస్తావా?: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

  • ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేయాలని సవాల్
  • రైతుబంధు పూర్తిగా వేయలేదుకానీ, రుణమాఫీ చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా
  • కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు 100 కారణాలు ఉన్నాయన్న హరీశ్ రావు
Harish Rao challenges CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. అగస్ట్ 15లోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెబుతున్నారని... ఆ లోగా చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తావా? అని సవాల్ చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ... అగస్ట్ లోగా రూ.39వేల కోట్ల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి చెబుతున్నారన్నారు. ఇప్పటి వరకు రైతుబంధు పూర్తిగా వేయలేదు కానీ... రుణమాఫీ చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించాలని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని... కానీ వారిని ఓడించేందుకు 100 కారణాలు చూపిస్తామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు ఓడించకుండా ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే మోసం, నమ్మకద్రోహం అని విమర్శించారు. రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరిచ్చిన గ్యారెంటీలే మీకు భస్మాసురహస్తం అవుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని ఎద్దేవా చేశారు.

నాలుగున్నర నెలల్లోనే ఏదేదో చేసినట్టు ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్ అంటే కరవు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని విమర్శించారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కలేదని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి తమని కలవడం లేదని మీ పార్టీ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, వీహెచ్‌లే అంటున్నారన్నారు. మెడలో పేగులు వేసుకుంటా... మానవ బాంబునై పేలుతా... డ్రాయర్ ఊడగొడుతా.. ముఖ్యమంత్రి ఇలాగేనా మాట్లాడేది? అన్నారు.

More Telugu News