Google: ‘ఎర్త్ డే’ గూగుల్ డూడుల్ చూశారా?

Google Doodle celebrates Earth Day 2024 with aerial view of planet biodiversity
  • గూగుల్ ఆకారంలోని ప్రాంతాల ఫొటోలతో డూడుల్ ను ప్రదర్శించిన గూగుల్
  • జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు జరుగుతున్న కృషిని చాటిన ఫొటోలు 
  • వాతావరణ సంక్షోభ నివారణకు మనమంతా ఇంకా ఎంతో చేయాల్సి ఉందని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన తేదీలను డూడుల్స్ గా ప్రదర్శించే గూగుల్ సోమవారం వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా వినూత్న డూడుల్ ను హోం పేజీపై ఉంచింది. భూమి సహజ అందాలను, జీవ వైవిధ్యాన్ని చాటేలా పైనుంచి తీసిన కొన్ని ప్రాంతాల ఫొటోలను డూడుల్ గా రూపొందించింది. అయితే ఆ ఫొటోలన్నీ గూగుల్ అక్షరాలను పోలి ఉండటం విశేషం. భూమి సహజ అందాన్ని, జీవ వైవిధ్యాన్ని, వనరులను కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజూ ప్రజలు, సమాజం, ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాన్ని తమ డూడుల్ తెలియజేస్తుందని గూగుల్ పేర్కొంది. వాతావరణ సంక్షోభం, జీవవైవిధ్య నష్టాన్ని నివారించేందుకు మనం చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని ఈ ఉదాహరణలు తెలియజేస్తాయని వివరించింది.

గూగుల్ అక్షరాల ఆకారంలో ఉన్న డూడుల్ ఫొటోల వెనకున్న కథ ఇదే..

‌‌– ‘జీ’ని పోలిన తొలి చిత్రంలోని ప్రాంతం టర్క్స్‌ అండ్‌ కైకోస్‌ దీవులది. అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఈ ప్రాంతం ఉంది. ఇది అంతరించిపోతున్న అనేక జీవులకు రక్షణగా నిలుస్తోంది. జీవ వైవిధ్యానికి కేంద్రంగా నిలుస్తోంది.

– ‘ఓ’ అక్షరాన్ని పోలిన ఫొటోలో కనిపిస్తున్నది మెక్సికోలోని స్కార్పియన్‌ రీఫ్‌ నేషనల్‌ పార్క్‌. యునెస్కో గుర్తింపు పొందిన ఈ కేంద్రం పగడపు దిబ్బలకు పేరుగాంచింది. అంతరించిపోయే దశలో ఉన్న పక్షులు, తాబేళ్లకు ఇది ఆవాసం.

– ‘ఓ’ఆకారంలోని ఫొటో ఐస్‌లాండ్‌లోని వట్నాజోకుల్ నేషనల్ పార్క్‌ కు చెందినది. ఇది యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌గా గుర్తింపు పొందింది. అగ్నిపర్వతాలు, మంచు మిశ్రమంతో అరుదైన వృక్షజాతులకు ఇది కేంద్రం.

– ‘జీ’ అక్షరాన్ని పోలిన ఈ చిత్రం బ్రెజిల్‌లోని జౌ నేషనల్‌ పార్క్‌. అమెజాన్‌ అడవుల మధ్యలో ఇది ఉంది. ఇందులో ఎన్నో అరుదైన జంతువులు నివసిస్తున్నాయి.

– ‘ఎల్’ ‘ఎల్‌’ ఆకారంలోని ఈ ప్రాంతం నైజీరియాలోని గ్రేట్‌ గ్రీన్‌వాల్‌. ఎడారిగా మారడం వల్ల ఈ ప్రాంతం రూపురేఖలను మళ్లీ పునరుద్ధరించేందుకు ఇక్కడ మొక్కలు నాటుతున్నారు.

– ‘ఈ’ అనే అక్షరాన్ని పోలిన ఈ ఫొటో ఆస్ట్రేలియాలోని పిల్బరా ఐలాండ్స్‌ నేచర్‌ రిజర్వ్స్‌ కు చెందినది. ఎన్నో సముద్ర తాబేళ్లు, పక్షులు, ఇతర జీవులు ఇక్కడ ఉంటున్నాయి.
Google
doodle
earthday
biodiversity

More Telugu News