Maldives Parliament Elections: మాల్దీవుల అధ్యక్షుడికి పార్లమెంటు ఎన్నికల్లో భారీ విజయం!

  • భారత్ పై వ్యతిరేకతతో చైనాకు దగ్గరవుతున్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
  • పార్లమెంటు ఎన్నికల్లో ముయిజ్జు సారథ్యంలోని పీఎన్‌సీకి 66 శాతం సీట్లు
  • మొత్తం 93 స్థానాలకు 67 స్థానాల్లో ఘన విజయం
Maldivian President Muizzu secures supermajority in parliamentary polls

భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తూ చైనాతో అంటకాగుతున్న మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకు పార్లమెంటు ఎన్నికల్లో భారీ విజయం దక్కింది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ) దాదాపు 66 శాతం సీట్లు కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది. 

జాతీయ ఎన్నికల కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. 72.96 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముయిజ్జు సారథ్యంలోని పీఎస్‌సీ 67 స్థానాలను దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ 12 సీట్లలో విజయం సాధించింది. 10 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. మిగతా సీట్లలో ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 

నగరాల్లో మంచి పట్టున్న ఎమ్‌డీపీకి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్ని నగరాల్లో అధికార పక్షానికి ప్రజలు పట్టం కట్టారు. 

చైనా అనుకూల వైఖరి అవలంబిస్తున్న ముయిజ్జుకు ఈ ఎన్నికలు కొత్త శక్తిని ఇచ్చాయి. వాస్తవానికి ఎన్నికలకు ముందు ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 2018లో ఆయన అవినీతికి సంబంధించి కీలక డాక్యుమెంట్లు వెలుగులోకి రావడంతో ప్రతిపక్షాలు అధ్యక్షుడిపై దర్యాప్తునకు పట్టుబట్టాయి. అయితే, ఈ ఆరోపణల్ని ముయిజ్జు తోసిపుచ్చారు. దీంతో, ఆయన విధానాలకు ప్రజల మద్దతు ఉందన్న విషయాన్ని ఈ ఎన్నికలు రుజువు చేశాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

More Telugu News