Chandrababu: బీ ఫారం తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి: చంద్రబాబు

Chandrababu wish every TDP candidate should win in upcoming elections
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి ఏం చేసాడో చెప్పుకోలేకే డ్రామాలకు తెరతీస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పెన్షన్ల విషయంలో జగన్ చేసిన కుట్రలు, ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు ఛీ కొట్టారన్నారు. ప్రజాగళానికి వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటిచెప్తోందన్నారు.  

పార్లమెంట్, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబు ఇవాళ ఉండవల్లిలోని తన నివాసంలో బీ ఫారాలు అందించారు. శ్రీకాకుళం జిల్లా నుండి మొదలు పెట్టి వరుసగా జిల్లాల వారీగా అభ్యర్థులకు బీ ఫారాలు తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...‘‘బీ ఫారాలు తీసుకున్న ప్రతి అభ్యర్థీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేశాం. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు గెలవాలి... రాష్ట్రం నిలవాలన్నదే మన నినాదం. 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలి... ఓటు బదిలీ జరగాలి. 

కొందరు వైసీపీలో సీటు ఇస్తానన్నా తీసుకోకుండా బయటకు వచ్చారు. వైసీపీ నుంచి మంచి వాళ్లను మాత్రమే టీడీపీలోకి తీసుకుని నేను సీట్లు ఇచ్చా. పార్టీలో కొత్తగా చేరిన వారు పార్టీ లైన్ ప్రకారం నడుచుకోవాలి. 

ఎన్నికలకు ఇక 22 రోజుల సమయమే ఉంది... ప్రచారానికి 20 రోజులే ఉంది. ఈ 20 రోజులు మీకు ఎంతో కీలకం. నేను ఇప్పటికే 40కి పైగా ప్రజాగళం సభలు నిర్వహించాను. పలు సభలు పవన్ కళ్యాణ్ తోనూ కలిసి నిర్వహించాను. 

రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం... ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లండి. లేనిది ఉన్నట్లు... ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్ నేర్పరి. ప్రతిసారీ సానుభూతితో గెలవాలని చూస్తున్నాడు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రూ.43 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధారిస్తే... దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకున్నాడు. 

జగన్ బస్సుయాత్రలో వాళ్లే కరెంట్ తీసేసుకున్నారు... చీకట్లో నేను దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లకార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేశారు. ఇందులో బొండా ఉమా ప్రమేయం ఉందని రాయి విసిరిన వ్యక్తితో చెప్పించేలా కుట్రలు చేస్తున్నారు. 

పెన్షన్ల పంపిణీకి నిధుల్లేకుండా చేశారు... కానీ, వాలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతో పెన్షన్లు ఆగిపోయాయని విష ప్రచారం చేశారు. జగనే అందరినీ అంతం చేయడానికి ప్రయత్నిస్తూ... తనను అంతం చేయడానికి వస్తున్నారని ఎదుటివారిపై బురదజల్లుతున్నారు. అమరావతి, పోలవరంను విధ్వంసం చేశాడు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. 

కేడర్ తో ప్రతి అభ్యర్థీ అనుసంధానం కావాలి. అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది...మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయండి’’ అని చంద్రబాబు టీడీపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.
Go Back to Shorts
Chandrababu
TDP Candidates
B Form
Andhra Pradesh

More Telugu News