union minister dharmendra pradhaan: సీఎం నవీన్ పట్నాయక్ వల్ల ఒడిశాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

No significant progress has taken place under Patnaik leadership
  • 24 ఏళ్లుగా పట్నాయక్ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని ధ్వజం
  • ఈసారి 21 ఎంపీ సీట్లలోనూ విజయం సాధిస్తామని ధీమా
  • అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోస్యం

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలో చెప్పుకోదగ్గ స్థాయిలో రాష్ర్టం అభివృద్ధి చెందలేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఒడిశాలోని సంబాల్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన తన ప్రచారం సందర్భంగా హిందూస్తాన్ టైమ్స్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. పార్టీ ప్రచార తీరు, విజయావకాశాల గురించి వివరంగా తెలియజేశారు.

అది పట్నాయక్ గిమ్మిక్కే..
పశ్చిమ ఒడిశాలోని కాంతాబంజీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయించుకోవడాన్ని ఎలా చూస్తారని అడగ్గా ధర్మేంద్ర ప్రధాన్ తనదైన శైలిలో స్పందించారు. నవీన్ పట్నాయక్ పోటీని ఓ గిమ్మిక్కుగా అభివర్ణించారు. గతంలో బిజేపూర్ స్థానంలో గెలిచాక ఆయన ఆ స్థానానికి రాజీనామా చేసి హింజిలీ సీటును అట్టిపెట్టుకున్నారని గుర్తుచేశారు. ఆయన వల్ల బార్గా జిల్లా ఏమైనా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో బిజేపూర్ అభివృద్ధిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని నవీన్ పట్నాయక్ హామీ ఇచ్చారని.. జిల్లాకు చెందిన ఒక నేతకు మంత్రి పదవి కూడా ఇచ్చారని ధర్మేంద్ర ప్రధాన్ గుర్తుచేశారు. అయినా ఆ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.

ఘోరంగా సీఎం సొంత నియోజకవర్గ పరిస్థితి
పశ్చిమ ఒడిశాలోని కాంతాబంజీ నియోజకవర్గం కూలీల వలసలకు చిరునామాగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గత 24 ఏళ్లుగా అధికారంలో ఉన్న పట్నాయక్ ప్రభుత్వం వలసలను నివారించలేకపోయిందని ఆయన విమర్శించారు. బొలాంగిర్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య వెంటాడుతోందని, సీఎం సొంత నియోజకవర్గమైన హింజిలిలో కూడా కార్మికుల వలసలు ఎక్కువగానే జరుగుతున్నాయన్నారు. ఎన్నికల బరిలో దిగుతున్న సీఎం నవీన్ పట్నాయక్.. ఈ సమస్యలన్నింటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాకే నామినేషన్ వేయాలని డిమాండ్ చేశారు. గత 24 ఏళ్లుగా ప్రజలను ఆయన మోసగించారని, ఆయన విశ్వసనీయత అధ:పాతాళానికి పడిపోయిందని దుయ్యబట్టారు.

అన్ని సీట్లూ గెలుస్తాం..
ఒడిశాలోని 21 లోక్ సభ స్థానాల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఒడిశా అసెంబ్లీలోనూ భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోస్యం చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.

  • Loading...

More Telugu News