Rahul Gandhi: మోదీ పాలనలో రైలు ప్రయాణం నరకంగా మారింది: రాహుల్ గాంధీ

In the rule of Narendra Modi travelling by train has become a punishment
  • ఓ బాధితుడి వీడియోను రీట్వీట్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
  • సామాన్యుల కోచ్ లు తగ్గించి సంపన్నుల కోచ్ లు పెంచుతున్నాడని ప్రధానిపై ఫైర్
  • రిజర్వేషన్ బోగీలలోనూ సౌకర్యంగా ప్రయాణించలేకపోతున్నారంటూ ఆరోపణ
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో రైలు ప్రయాణం ఓ శిక్షలాగా మారిందని కాంగ్రెస్ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. సామాన్యులు ప్రయాణించే జనరల్ బోగీలను తగ్గించి, సంపన్నులు ప్రయాణించే ఏసీ బోగీలను పెంచారని ఆరోపించారు. జనరల్ కోచ్ లతో పాటు స్లీపర్ కోచ్ లు కూడా తగ్గించారని, దీంతో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు కూడా సౌకర్యంగా ప్రయాణించలేక పోతున్నారని చెప్పారు. మోదీ విధానాల కారణంగా సామాన్యులతో పాటు సంపన్నులు కూడా రైలు ప్రయాణం సాఫీగా చేయలేకపోతున్నారని మండిపడ్డారు.

అన్ని వర్గాల ప్రయాణికులనూ మోదీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఈమేరకు ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేస్తూ.. రైలు ప్రయాణికుల కష్టాలను చూపించారు. రిజర్వ్ డ్ బోగీలోనూ ప్రయాణికులు కిక్కిరిసిపోయిన వైనాన్ని, బోగీలో చోటులేక టాయిలెట్ లో కూర్చుని ప్రయాణిస్తున్న అవస్థను ఈ వీడియోలో చూపించారు. రైల్వే వ్యవస్థను నిర్వీర్యం చేయడం ద్వారా దానిని ప్రైవేటీకరించి తన స్నేహితులకు కట్టబెట్టాలని మోదీ చూస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. సామాన్యుల ప్రయాణ సాధనం రైల్వేను కాపాడాలంటే మోదీని గద్దెదించాల్సిందేనని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు.
Rahul Gandhi
Train journey
Congress
Narendra Modi

More Telugu News