Inter results: 24న విడుదల కానున్న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

  • ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న అధికారులు
  • గతేడాదితో పోల్చితే 15 రోజుల ముందుగానే ఫలితాలు
  • ఈ నెల 30 లేదా 1న పది ఫలితాల విడుదలకు విద్యాశాఖ సన్నాహాలు
Telangana Inter results to be released on 24 of this month

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. ఈ బుధవారం (ఏప్రిల్ 24న) విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు అధికారులు వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 తేదీల మధ్య ఇంటర్మీడియట్‌ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది. రెండు సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 10 నుంచి ఈనెల 10 తేదీల మధ్య మూల్యాంకనాన్ని పూర్తి చేశారు.

గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే ఫలితాలు ప్రకటించబోతున్నారు. 2023లో మే 9న రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి మార్కుల నమోదులో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బంధీ చర్యలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడు సార్లు పరిశీలించారు. కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తిచేశారు. 

ఈ నెల 30న లేదా మే 1న పది ఫలితాలు..
10వ తరగతి ఫలితాల విడుదలపై కూడా విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది. ఈ నెల 30 లేదా మే 1న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇంటర్‌, పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మూల్యాంకనం శనివారం పూర్తయింది. డీకోడింగ్‌ అనంతరం ఫలితాలు వెల్లడించానున్నారు.

More Telugu News