Venkatramireddy: ఈసీ ఆదేశాలతో.... ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు

EC orders suspension on AP Secretariat Employees Association President Venkatramireddy
  • ఏపీలో ఎన్నికల కోడ్ అమలు
  • ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు
  • తాజాగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
రాష్ట్రంలో గత నెల 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ఈసీ తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే ఏపీలో పలువురు ఉన్నతాధికారులు ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై వేటు పడింది. 

వెంకట్రామిరెడ్డి ఉద్యోగ రీత్యా పంచాయతీరాజ్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. కొన్నిరోజుల కిందట వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినట్టు వెల్లడైంది. కడప జిల్లా బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి అనుకూలంగా ఓటు వేయాలని వెంకట్రామిరెడ్డి ప్రచారం చేశారని టీడీపీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ ఫిర్యాదును పరిశీలించిన ఈసీ... కడప జిల్లా కలెక్టర్ తో నివేదిక తెప్పించుకుంది. వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు నిర్ధారణ కావడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిది. 

ఈసీ ఆదేశాలతో వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. హెడ్ క్వార్టర్స్ దాటి ఎక్కడికీ వెళ్లరాదని స్పష్టం చేసింది.
Venkatramireddy
Suspension
EC
YSRCP
Andhra Pradesh

More Telugu News