KTR: బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాద్... కిషన్ రెడ్డి భయపడుతున్నారు: కేటీఆర్

KTR says BRS will win secunderabad seat
  • పద్మారావు గౌడ్ పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి ఆలోచనలో పడ్డారన్న కేటీఆర్
  • బీజేపీని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదన్న బీఆర్ఎస్ నేత
  • రాముడు బీజేపీ పార్టీ కాదని... ఆయన అందరివాడన్న కేటీఆర్

తెలంగాణలో బీఆర్ఎస్ గెలిచే మొదటి సీటు సికింద్రాబాద్ అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక్కడి నుంచి పద్మారావు గౌడ్ మన పార్టీ తరఫున పోటీలో ఉండటంతో కిషన్ రెడ్డి ఆలోచనలో పడ్డారని పేర్కొన్నారు. యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి ఏం చేశారని నిలదీశారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ వెంట నడిచిన సైనికుడు పద్మారావు అని ప్రశంసించారు. పద్మారావును చూసి కిషన్ రెడ్డి భయపడుతున్నారంటే మన గెలుపు ఖరారైనట్లే అన్నారు. బీజేపీ తీరు ఎలా ఉందంటే... ఎవరైనాసరే మోదీ జేబులో ఉండాలి, లేదంటే జైలులో ఉండాలి అన్నట్లుగా దేశంలో పరిస్థితి మారిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హైదరాబాద్‌లో క్లీన్ స్వీప్‌ చేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించింది బీఆర్‌ఎస్సే అన్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌లను ఓడించింది బీఆర్ఎస్ వారే అన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కిషన్‌ రెడ్డిని ఓడించేది మన పద్మారావే అన్నారు.

కరోనా సమయంలో చాలామంది నాయకులు మంచి పనులు చేశారని, సీతాఫల్‌మండిలో పద్మారావు గౌడ్‌ రెండు రెండున్నర కోట్లు ఖర్చుపెట్టి అన్నదానాలు చేశారని తెలిపారు. కిషన్‌ రెడ్డి మాత్రం కుర్‌కురే ప్యాకెట్లు పంచాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ కాళేశ్వరం లిఫ్ట్‌లు ప్రారంభిస్తే.. కిషన్‌రెడ్డి సీతాఫల్‌మండి స్టేషన్‌లో లిఫ్టులు ప్రారంభించారన్నారు. గుడిమల్కాపూర్‌లో సింటెక్స్‌ ట్యాంకులకు కిషన్‌ రెడ్డి కొబ్బరికాయలు కొడుతున్నారన్నారు. రాముడు బీజేపీ పార్టీ కాదని... ఆయన అందరివాడు అని  స్పష్టం చేశారు. రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదామని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News