indonesia: ఇండోనేసియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు బద్దలైన అగ్నిపర్వతం

More than 11000 evacuated in northern Indonesia as volcano erupts
  • ఆకాశంలో సుమారు 2 కి.మీ. ఎత్తు వరకు దుమ్ము, ధూళి వ్యాప్తి
  • సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత
  • పొరుగున ఉన్న మలేసియాలోనూ పలు విమాన సర్వీసుల రద్దు
ఇండోనేసియాలోని ఉత్తర సులవేసీ ప్రావిన్సు రాజధాని మనాడో సమీపంలో ఉన్న మౌంట్ రౌంగ్ అగ్నిపర్వతం మూడు రోజుల వ్యవధిలో ఐదు సార్లు బద్దలైంది. భగభగ మండే ఎర్రని లావా కిందున్న సముద్రంలో కలవగా, ఆకాశంలోకి సుమారు 2 కిలోమీటర్ల ఎత్తు వరకు భారీ స్థాయిలో దుమ్ము, ధూళి వ్యాపించాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని 11 వేల మందికిపైగా స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే మనాడోలోని శామ్ రతులంగి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును గురువారం సాయంత్రం వరకు తాత్కాలికంగా మూసేశారు. 

ముందు ఒకసారి.. ఆ తర్వాత మరో నాలుగుసార్లు
మౌంట్ రౌంగ్ అగ్నిపర్వతం స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9:45 గంటలకు (13:45 జీఎంటీ) తొలిసారి బద్దలైంది. ఆ తర్వాత బుధవారం ఒక్కరోజులోనే నాలుగుసార్లు బద్దలై దుమ్ము, ధూళిని విరజిమ్మింది. దీంతో ఇండోనేసియా అగ్నిపర్వత ఏజెన్సీ నాలుగో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అగ్నిపర్వత ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరం వరకు ఖాళీ చేయాల్సిన ప్రాంతాలను 6 కిలోమీటర్ల దూరం వరకు పెంచింది.

వేల మంది ఖాళీకి ఆదేశం
ముందుగా 800 మందికిపైగా స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరలించిన అధికారులు ఆ తర్వాత అక్కడ నివసిస్తున్న 11,665 మంది స్థానికులను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించారు. అగ్నిపర్వతంలో ఓ భాగం సముద్రంలో కుప్పకూలే అవకాశం ఉందని... ఇది సునామీ వచ్చేందుకు దారితీయొచ్చని ఆందోళన చెందుతున్నారు. 1871లో ఇలాగే జరిగిందని గుర్తుచేశారు.

విమాన సర్వీసుల రద్దు
అగ్నిపర్వతం వెదజల్లే బూడిద వల్ల విమానాలకు ప్రమాదం తలెత్తుతుందన్న ఉద్దేశంతో శామ్ రతులంగి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విమాన రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో చైనా, సింగపూర్, ఇండోనేసియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇండోనేసియాకు సమీపంలోని మలేసియాలో ఉన్ కోటా కినబాలు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోనూ కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి.
indonesia
volcano
eruption
evacuation

More Telugu News