ఐపీఎల్ ట్రోఫీ ఆ జట్టుదేనట.. తేల్చేసిన ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్

Attacking Batting Going To Win This IPL Told Ricky Ponting
  • రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లు
  • ఈసారి భారీ స్కోర్లతో బద్దలవుతున్న రికార్డులు  
  • బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగిన జట్టే ట్రోఫీ గెలుస్తుందని పాంటింగ్ జోస్యం
ఐపీఎల్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. చివరి బంతి వరకు కొనసాగుతూ ఉత్కంఠను పంచుతున్నాయి. టీ20లోని అసలైన మజాను అభిమానులకు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకునేది ఎవరన్న ప్రశ్నకు ఢిల్లీ కేపిటల్స్ హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అటాకింగ్ బ్యాటింగ్‌ను ఎంచుకునే జట్టే ట్రోఫీని సొంతం చేసుకుంటుందని తేల్చి చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన 31 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోందని పేర్కొన్నాడు. 9 మ్యాచుల్లో జట్లు 200, అంతకంటే ఎక్కువ స్కోరు సాధించిన విషయాన్ని గుర్తుచేశాడు. 

ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల రికార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రెండుసార్లు నెలకొల్పింది. హైదరాబాద్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 277/3 పరుగులు చేసి, 2013లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేసిన 263/5 పరుగుల రికార్డును తుడిచిపెట్టేసింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ క్రిస్ గేల్ 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హైదరాబాద్ జట్టు మరోమారు తన రికార్డును తానే బద్దలుగొట్టింది. బెంగళూరులో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 287/3 పరుగులు చేసింది. 

నేడు ఢిల్లీ కేపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాంటింగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రెండుసార్లు భారీ స్కోర్లు సాధించిందని, కోల్‌కతా జట్టు తమపై 272/7 పరుగులు చేసిందని గుర్తుచేశాడు. జట్ల బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభావం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు. ఈసారి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన జట్టే ట్రోఫీ సాధిస్తుందని స్పష్టం చేశాడు. కాగా, ఢిల్లీ కేపిటల్స్ మాత్రం ఈ సీజన్‌లో పడుతూ లేస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన డీసీ నాలుగింటిలో ఓడి పట్టికలో ఏడో స్థానంలో ఉంది.
Go Back to Shorts
Ricky Ponting
IPL 2024
Delhi Capitals
SRH
RCB
RR
KKR

More Telugu News