Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల వ్యవహారం... ఇది ట్రైలర్ మాత్రమేనన్న లారెన్స్ బిష్ణోయ్!

Lawrence Bishnoi gang takes responsibility for firing at Salman Khan residence in Mumbai
  • ముంబయిలో సల్మాన్ నివాసం వద్ద ఈ ఉదయం కాల్పులు
  • బైక్ పై వచ్చి ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు
  • కాల్పులు తమ పనే అని ప్రకటించుకున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
ముంబయిలో ఇవాళ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం చెలరేగడం తెలిసిందే. బైక్ పై వచ్చిన దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. కాగా, ఈ ఘటనకు తమదే బాధ్యత అని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఫేస్ బుక్ ఖాతా నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఇది ట్రైలర్ మాత్రమేనని, ఈసారి తమ కాల్పులు ఇంటి బయటే ఆగిపోవన్న విషయం గ్రహించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇవాళ్టి కాల్పులతో తమ సత్తా ఏంటో అర్థమయ్యే ఉంటుందని, ఇదే చివరి వార్నింగ్ అని, తమ సహనాన్ని పరీక్షించవద్దని స్పష్టం చేశారు. 

కాగా, సల్మాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు వాడినట్టుగా భావిస్తున్న ఓ బైక్ ను సల్మాన్ ఇంటికి కొంచెం దూరంలో స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ సల్మాన్ నివాసం వద్ద పలు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. 

సల్మాన్ ఖాన్ గతంలో రాజస్థాన్ లో షూటింగ్ సందర్భంగా కృష్ణ జింకలను వేటాడడం తెలిసిందే. అయితే బిష్ణోయ్ తెగ ప్రజలు కృష్ణజింకలను ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తారు. అందుకే లారెన్స్ బిష్ణోయ్... సల్మాన్ ఖాన్ పై పగబట్టాడు. 

ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పలుమార్లు సల్మాన్ కు హెచ్చరికలు చేసింది. కాగా, కృష్ణ జింకల కేసు నుంచి సల్మాన్ నిర్దోషిగా బయటపడడం లారెన్స్ బిష్ణోయ్ ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉన్నాడు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Salman Khan
Firing
Lawrence Bishnoi
Mumbai
Bollywood

More Telugu News