Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం!

Shots fired outside Salman Khans Mumbai home gunmen flee on bike
  • ముంబైలోని గ్యాలెక్సీ అపార్ట్‌మెంట్స్ ముందు ఆదివారం తెల్లవారుజామున కాల్పులు
  • బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి పారిపోయిన ఇద్దరు నిందితులు
  • ఘటన నేపథ్యంలో సల్మాన్ ఇంటి ముందు భద్రత కట్టుదిట్టం
  • సల్మాన్‌ను మట్టుపెడతామని గతంలోనే గ్యాంగస్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ హెచ్చరికలు
ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం రేగింది. ఆదివారం తెల్లవారుజామున 4.51 గంటలకు బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతుకులు ముంబైలోని గ్యాలెక్సీ అపార్ట్‌మెంట్ ముందు గాల్లో కాల్పులు జరిపి పారిపోయారు. తొలుత మూడు రౌండ్లు, ఆపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి వెళ్లిపోయారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఇంటిముందు భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు, ముంబై క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సల్మాన్ ఖాన్‌ను మట్టుబెడతామంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ, గోల్డీ బ్రార్‌లు గతంలో అనేక మార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు ఇప్పటికే తమ షూటర్లను ముంబైకి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2018లో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్రా సల్మాన్ ఖాన్‌ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడు. అయితే, అతడు దాడికి తెగబడకముందే పోలీసులకు చిక్కడంతో సల్మాన్‌‌పై దాడి ప్లాన్ పోలీసులకు తెలిసింది. సల్మాన్‌కు ప్రాణహాని పొంచి ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఆయన ఇంటిముందు మూడు షిఫ్టుల్లో పహారా కాస్తున్నారు. మరోవైపు, సల్మాన్‌కు ఆయుధ లైనెన్స్ కూడా మంజూరైంది. వ్యక్తిగత ఆయుధాన్ని నిత్యం వెంట తీసుకెళ్లేందుకు సల్మాన్‌కు పోలీసులు అనుమతించారు. 

డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో లారెన్స్ బిష్ణోయ్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అంతుకుమునుపు జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోల్డీ బ్రార్ మాట్లాడుతూ తనకు, లారెన్స్ బిష్ణోయ్‌కు అవకాశం చిక్కితే సల్మాన్‌పై దాడి చేస్తామని పేర్కొన్నాడు.
Salman Khan
Mumbai
Crime News
Galaxy Apartments
Bollywood
Gunfire

More Telugu News