YS Vimala: షర్మిల, సునీత వల్ల కుటుంబంలో అందరూ ఏడుస్తున్నారు.. కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారు: మేనత్త విమల

Sharmila and Sunitha are dragging the respect of YS family to roads says YS Vimala
  • వివేకాను ఎవరు చంపారో వీళ్లే డిసైడ్ చేస్తున్నారని విమల మండిపాటు
  • హత్య అంశంలోకి జగన్ ను కూడా లాగుతున్నారని ఆగ్రహం
  • కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్య
వైఎస్ షర్మిల, సునీతలపై వారి మేనత్త, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని ఆమె మండిపడ్డారు. తమ ఇంటి ఆడపిల్లలు ఇలా మాట్లాడుతూ కుటుంబాన్ని బజారుపాలు చేయడం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. వారి వ్యాఖ్యలను భరించలేకపోతున్నానని అన్నారు. వివేకానందరెడ్డిని వైఎస్ అవినాశ్ రెడ్డి హత్య చేయడాన్ని వీరు చూశారా? అని ప్రశ్నించారు. ఎవరు హత్య చేశారో వీళ్లే డిసైడ్ చేసేస్తే... ఇంక కోర్టులు, జడ్జిలు ఎందుకని అడిగారు. హత్య చేసిన వాడు బయట తిరుగుతున్నాడని.... అతను చెప్పిన మాటలు విని అవినాశ్ పై ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు. 

వివేకా హత్య అంశంలోకి జగన్ ను కూడా లాగుతున్నారని విమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్ బెయిల్ రద్దు చేయమని షర్మిల, సునీత పోరాడుతున్నారని విమర్శించారు. అవినాశ్ కు కూడా ఒక కుటుంబం ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ఏ పాపం చేయని తన సోదరుడు భాస్కర్ రెడ్డి ఏడాది కాలంగా జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల, సునీత చేస్తున్న పనుల వల్ల తమ కుటుంబ సభ్యులందరూ ఏడుస్తున్నారని చెప్పారు. శత్రువులంతా ఒక్కటైనప్పుడు సొంత కుటుంబ సభ్యుడికి అందరూ తోడుగా ఉండాలని అన్నారు. 

వివేకానందరెడ్డి అంటే షర్మిల, సునీత కంటే తనకే ఎక్కువ ఇష్టమని విమల తెలిపారు. జగన్ పై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డి ఫ్యాక్షన్ కు దూరంగా ఉన్నారని.. రాజారెడ్డిని చంపినా ప్రతీకారం తీర్చుకోలేదని చెప్పారు. మనుషులను చంపేంత క్రూరత్వం తమ కుటుంబంలో లేదని అన్నారు. తమ ఇంట్లోని ఆడపిల్లలు ఇలా తయారు కావడం బాధ కలిగిస్తోందని చెప్పారు.
YS Vimala
YS Sharmila
YS Sunitha Reddy
Congress
Jagan
YS Avinash Reddy
YSRCP
YS Vivekananda Reddy

More Telugu News