Suryakumar Yadav: ఇషాన్, సూర్య విధ్వంసం.. ఆర్సీబీపై భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన ముంబై ఇండియన్స్

  • 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే బాదేసిన ముంబై బ్యాటర్లు
  • చెలరేగిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్
  • బౌలర్లు తేలిపోవడంతో ఆర్సీబీకి ఎదురైన మరో ఘోర ఓటమి
Destruction of Suryakumar Yadav make Mumbai Indians comfortable victory over RCB

ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని పాండ్యా సేన చిత్తుచిత్తుగా ఓడించింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ముంబై బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో ఆర్సీబీ బౌలర్లను చితక్కొట్టారు. ముఖ్యంగా ఓపెనర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించారు. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. వీరికి తోడు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, చివరిలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా రాణించడంతో కేవలం 3 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్లు తేడాతో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 69 పరుగులు బాదాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో మెరిశాడు. పాత సూర్యను గుర్తుచేస్తూ కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 19 బంతులు ఎదుర్కొని 52 పరుగులు కొట్టాడు. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ (38), ఎదుర్కొన్న ఆరు బంతుల్లో 3 సిక్సర్లు బాదిన హార్ధిక్ పాండ్యా (21 నాటౌట్), తిలక్ వర్మ (16 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయారు. ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించలేక భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆకాశ్ దీప్, విజయ్‌కుమార్ వైశాక్, విల్ జాక్స్ తలో వికెట్ తీశారు.

రాణించిన ఫాఫ్ డుప్లెసిస్, దినేశ్ కార్తీక్...
ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పటీదార్ మెరవడం, చివరిలో ఫినిషర్ దినేశ్ కార్తీక్ రాణించడంతో ఆర్సీబీ ఈ భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ (3), ఆ వెంటనే విల్ జాక్ (8) ఔట్ అయినప్పటికీ మూడవ వికెట్‌కు డుప్లెసిస్, రజత్ పటీదార్ 80 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆదుకున్నారు. ఇక చివరిలో దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో 53 పరుగులు బాది నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 

విరాట్ కోహ్లీ (3), డుప్లెసిస్ (61), విల్ జాక్స్ (8), రజత్ పటీదార్ (50), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్), మహిపాల్ లామ్రోర్ (0), సౌరవ్ చౌహాన్ (9), విజయ్ కుమార్ వైశాక్ (0), ఆకాశ్ దీప్ (2 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలర్లలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. 5 వికెట్లు తీశాడు. 4 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిగతా బౌలర్లలో కోయిట్జీ, ఆకాశ్ మధ్వల్, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీశారు.

More Telugu News