Hamas: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ ముగ్గురు కొడుకులు, ఇద్దరు మనవళ్ల మృతి

3 Sons and 2 Grandchildren Of Hamas Chief Killed In Israeli Airstrike On Car
  • కారులో ఉన్న సమయంలో వైమానిక దాడి చేసిన ఇజ్రాయెల్
  • అధికారికంగా ప్రకటించిన హమాస్
  • దేశ ప్రజల రక్తం కంటే తన కొడుకుల రక్తం అంత ఎక్కువేం కాదన్న హమాస్ చీఫ్ ఇస్మాయిల్
గతేడాది అక్టోబర్‌లో తమ దేశంలో మారణహోమం సృష్టించిన పాలస్థీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ బుధవారం జరిపిన వైమానిక దాడిలో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాహ్ ముగ్గురు కొడుకులు, ఇద్దరు మనవళ్లు మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని హమాస్ తో పాటు, హనీయా కుటుంబం కూడా ప్రకటించింది. ఇస్మాయిల్ ముగ్గురు కుమారులు హజెమ్, అమీర్, మహ్మద్ చనిపోయారని తెలిపింది. గాజాలోని అల్-షతి క్యాంపులో వారు ముగ్గురు కారులో ఉన్న సమయంలో వైమానిక దాడి చేశారని హమాస్ పేర్కొంది. కారులోనే ఉన్న ఇద్దరు ఇస్మాయిల్ మనవళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కాగా మరొకరు కూడా ఈ దాడిలో గాయపడ్డారని మీడియాకు హమాస్ వెల్లడించింది.

తన కొడుకులు, మనవళ్లు చనిపోవడంపై హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాహ్ స్పందించారు. చర్చల ముగింపు దశలో, హమాస్ స్పందనను తెలియజేయడానికి ముందు తన కొడుకులను లక్ష్యంగా చేసుకుంటే పరిస్థితులు మారిపోతాయని శత్రువు ఇజ్రాయెల్ భావించడం భ్రాంతి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దాడిని ఆయన ఖండించారు. తమ డిమాండ్లు స్పష్టంగా, నిర్దిష్టంగా ఉన్నాయని పునరుద్ఘాటించారు. ‘మా దేశ ప్రజల రక్తం కంటే నా కొడుకుల రక్తం అంత ప్రియమైనదేం కాదు’’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఖతార్‌లో ఉన్న ఇస్మాయిల్ హనియాహ్ ‘అల్ జజిర’ టీవీతో ఈ మేరకు మాట్లాడారు. 

కాగా ఇజ్రాయెల్‌కు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ ప్రధాన టార్గెట్‌గా ఉన్నాడు. గతేడాది నవంబర్‌లో గాజా స్ట్రిప్‌లోని అతడి ఇల్లు ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ధ్వంసమైంది. మరోవైపు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని హమాస్ చెబుతోంది. ఇజ్రాయెల్ ప్రతిపాదనలు పాలస్తీనా డిమాండ్‌లలో ఒక్కదాన్ని కూడా నెరవేర్చేలా లేవని హమాస్ మంగళవారం పేర్కొంది.
Hamas
Israel
Ismail Haniyeh
Palestine

More Telugu News