Peter Higgs: దైవ కణాన్ని కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త కన్నుమూత

Physicist Peter Higgs Who Discovered God Particle Dies At 94
  • బ్రిటీష్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ కన్నుమూత
  • సోమవారం ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచిన వైనం
  • పీటర్ హిగ్స్ దార్శనికుడని కొనియాడిన యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరొ

యావత్ సృష్టికి కారణమైన మూలకణాల్లో ఒకటైన దైవ కణాన్ని (హిగ్స్ బోసాన్) కనుగొన్న దిగ్గజ బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ (94) కన్నుమూశారు. సోమవారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్టు యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరొ తాజాగా ప్రకటించింది. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన కన్నుమూసినట్టు తెలిపింది. గొప్ప గురువుగా, మార్గదర్శిగా ఆయన ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొంది. 

భౌతికశాస్త్రంలో ఓ పెద్ద చిక్కుముడిగా మారిన ద్రవ్యరాశి అంశాన్ని పీటర్ హిగ్స్ పరిష్కరించి ప్రపంచ ప్రఖ్యాతి గడించారు. 1964లో తన సిద్ధాంతాల ద్వారా దైవ కణం ఉనికిని చాటిన ఆయన సృష్టిలో ప్రతి వస్తువు ద్రవ్యరాశికి దైవ కణం కారణమని నిరూపించారు. ఆయన సిద్ధాంతానికి గాను 2013లో పీటర్ హిగ్స్, బెల్జియన్ శాస్త్రవేత్త ఫ్రాంకాయ్ ఎంగ్లెర్ట్‌తో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. హిగ్స్ సిద్ధాంతాలపై యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ సంస్థ.. లార్జ్ హేడ్రన్ కొలైడర్ అనే పరికరంతో జరిపిన పరిశోధనల్లో దైవ కణం ఉనికి వాస్తవమని తేలింది. గత ఐదు దశాబ్దాలుగా పీటర్ హిగ్స్.. ఎడిన్‌బరొ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. 

పీటర్ హిగ్స్ ఓ అద్భుతమైన వ్యక్తి అని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరొ పేర్కొంది. ఆయన తన దార్శనికత, సృజనాత్మకతతో విశ్వరహస్యాల గుట్టువిప్పారని పేర్కొంది. పీటర్ హిగ్స్ పరిశోధనలు వేల మంది శాస్త్రవేత్తలకు స్ఫూర్తిగా నిలిచాయని, భవిష్యత్తు తరాలు ఆయనను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయని యూనివర్శిటీ వీసీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News