Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డి ఎలాంటి నేపథ్యం నుంచి వచ్చాడో నాకు తెలుసు: హనుమ విహారి

  • ఇవాళ పంజాబ్ కింగ్స్ పై చెలరేగిన సన్ రైజర్స్ ఆటగాడు నితీశ్ రెడ్డి
  • నితీశ్ పడిన కష్టానికి ఫలితం దక్కిందన్న హనుమ విహారి
  • భవిష్యత్తులో టీమిండియాకు ఓ విలువైన ఆటగాడిగా మారతాడని జోస్యం
Hanuma Vihari reacts on Nitish Kumar Reddy flamboyant innings against PBKS

మొన్న చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ఓ సిక్స్ తో విన్నింగ్ షాట్  కొట్టిన యువ బ్యాట్స్ మెన్ నితీశ్ కుమార్ రెడ్డి... ఆ రోజు కాసేపే క్రీజులో ఉన్నాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో తన పూర్తి సామర్ధ్యాన్ని చూపించిన నితీశ్ కుమార్ రెడ్డి ఐపీఎల్ కెరీర్ లో తొలి అర్ధసెంచరీ నమోదు చేసుకున్నాడు. తద్వారా సన్ రైజర్స్ జట్టులో తనకుంటూ ఓ గుర్తింపు ఏర్పరచుకున్నాడు. 

నితీశ్ రెడ్డి వయసు 20 ఏళ్లే. అతడికి ఉజ్వల భవిష్యత్ ఉందని ఇవాళ్టి ఇన్నింగ్స్ చూశాక ప్రతి ఒక్క కామెంటేటర్ చెప్పారు. నితీశ్ కుమార్ ఆంధ్రా క్రికెట్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్. అతడి గురించి టీమిండియా ఆటగాడు హనుమ విహారి ఆసక్తికర ట్వీట్ చేశాడు. 

"ఎన్కేఆర్ (నితీశ్ కుమార్ రెడ్డి) కొంచెం పేద కుటుంబం నుంచి వచ్చాడు. కొడుకును క్రికెటర్ గా తీర్చిదిద్దడం కోసం నితీశ్ తండ్రి ఉద్యోగం మానేశాడు. తండ్రి మార్గదర్శకత్వంలో నితీశ్ నికార్సయిన క్రికెటర్ గా తయారయ్యాడు. నితీశ్ పడ్డ కష్టానికి ఫలితం లభించింది. అతడికి 17 ఏళ్ల వయసున్నప్పుడు నేను మొదటిసారి చూశాను. ఇప్పుడు అతడు ఓ క్రికెటర్ గా ఎదిగిన తీరు చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నిజంగా ఓ ఆస్తి లాంటి వాడు. భవిష్యత్తులో టీమిండియాకు కూడా విలువైన ఆటగాడిగా మారతాడు" అంటూ నితీశ్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. 

దేశవాళీ క్రికెట్లో ఆంధ్రా రంజీ టీమ్ కు ప్రాతినిధ్యం వహించే నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 566 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. అన్నట్టు... నితీశ్ మీడియం పేసర్ కూడా. దేశవాళీ పోటీల్లో 52 వికెట్లు తీశాడు. అందులో 5 వికెట్ల ప్రదర్శన రెండు సార్లు నమోదు చేశాడు.

  • Loading...

More Telugu News