Pawan Kalyan: పిఠాపురంలో జనసేనాని గృహప్రవేశం.. ఉగాది వేడుకలు.. వీడియో ఇదిగో!

Pawan Kalyan House warming ceremony In Pithapuram
  • చేబ్రోలులో ఇల్లు తీసుకున్న పవన్ కల్యాణ్
  • అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్న జనసేన చీఫ్
  • స్థానికంగా ఉండరనే ప్రత్యర్థుల ప్రచారానికి చెక్
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పిఠాపురంలో మంగళవారం గృహప్రవేశం చేశారు. ఉగాది పండుగను వేదపండితుల మధ్య జరుపుకున్నారు. పంచాగశ్రవణం సహా పూజాదికాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో లైవ్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేనాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో ప్రచారం మొదలుపెట్టిన మొదటిరోజే స్థానికంగా ఓ ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటానని పవన్ ప్రకటించారు. ఇందులో భాగంగానే చేబ్రోలులో కొత్తగా నిర్మించిన ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. కొత్త ఇంటిని తన అవసరాలకు అనుగుణంగా మార్చుకున్న పవన్.. పక్కనే పంటపొలాల్లో హెలీప్యాడ్ నిర్మాణం జరిపిస్తున్నారు. దీనికి సంబంధించి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని జనసేన వర్గాలు తెలిపాయి.

పిఠాపురం నుంచి పోటీ చేయనున్న పవన్ కల్యాణ్ పై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఆయన స్థానికంగా ఉండరంటూ ప్రచారం చేశారు. దీనికి చెక్ చెప్పేందుకే పవన్ కల్యాణ్ చేబ్రోలులో ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఓదూరి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన దగ్గర నుంచి పవన్ ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఈ ఇంట్లో గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. ఉగాది వేడుకలను జనసేన నాయకులు, అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు.

Pawan Kalyan
Pithapuram
House warming
New House
Chebrolu
AP Assembly Polls
Janasena

More Telugu News