CSK: చెన్నై సూపర్ కింగ్స్ కు సిల్లీ టార్గెట్ ఇచ్చిన కోల్ కతా

  • చెన్నైలో సీఎస్కే × కేకేఆర్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులు చేసిన కోల్ కతా
  • పరుగుల కోసం చెమటోడ్చిన కోల్ కతా బ్యాటర్లు
CSK bowlers restricted KKR for low score

చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్ ఆశించిన స్థాయిలో ఆడడంలో విఫలమైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 137 పరుగులు చేసింది. 

ఓపెనర్ ఫిల్ సాల్ట్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే అవుట్ కాగా, సునీల్ నరైన్ 27, రఘువంశీ 24, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 34 పరుగులతో ఓ మోస్తరుగా రాణించారు. శ్రేయాస్ అయ్యర్ షార్ట్ పిచ్ బంతులు ఆడడంలో తన బలహీనతను ఈ మ్యాచ్ ద్వారా మరోసారి బయటపెట్టుకున్నాడు. అయ్యర్ వీక్ నెస్ తెలిసిన చెన్నై బౌలర్లు పదే పదే స్లో షార్ట్ బాల్స్ విసరగా, ఆ బంతులను ఆడేందుకు అయ్యర్ ఆపసోపాలు పడ్డాడు. చివరికి ఓ షార్ట్ బాల్ కే బలయ్యాడు. 

క్రీజులో ఉన్నంతసేపూ అసౌకర్యంగా కనిపించిన వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 3, రవీంద్ర జడేజా 3, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 2, మహీశ్ తీక్షణ 1 వికెట్ పడగొట్టారు.

More Telugu News