Advertisement

కోర్టు పరిధిలో ఉన్న వాటిపై షర్మిల మాట్లాడుతున్నారు... ఈసీకి ఫిర్యాదు చేస్తాం: వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma fires on Sharmila
  • కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన షర్మిల
  • జగన్ ప్రభుత్వం లక్ష్యంగా వ్యాఖ్యలు
  • షర్మిల ప్రచారం పూర్తిగా ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా ఉందన్న వాసిరెడ్డి పద్మ
  • షర్మిల రంగులు మార్చడంలో చంద్రబాబును మించిపోయారని విమర్శలు
  • షర్మిలను చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని వ్యాఖ్య 
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచార పర్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన ప్రచారంలో ఆమె ప్రధానంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర  మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఘాటుగా స్పందించారు.

షర్మిల ప్రచారం ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధంగా ఉందని, ఈ విషయాన్ని తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు. వ్యక్తిగత అజెండాతోనే షర్మిల... సీఎం జగన్ పై నిందలు వేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. 

కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మాట్లాడకూడదన్న విషయం షర్మిల తెలుసుకోవాలని హితవు పలికారు. ఎంతో తీవ్రమైన అంశంలో తీర్పు, శిక్ష ఈవిడే ఖరారు చేస్తున్నారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. వైఎస్ కుటుంబాన్ని విడదీసే కుట్రలు ఈనాటివి కావని, కడప ప్రజలకు అన్నీ తెలుసని అన్నారు. షర్మిల చేస్తున్నవి సానుభూతి రాజకీయాలన్న విషయం అందరికీ అర్థమైందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు.  

షర్మిల ఎన్ని అంశాల్లో యూటర్న్ తీసుకున్నారో అందరికీ తెలుసని, షర్మిల తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అన్నారు. రంగులు మార్చడంలో ఆమె చంద్రబాబును మించిపోయారని వ్యాఖ్యానించారు. 

నాడు అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారు, విభజన హామీలపై ఏంచేసింది కాంగ్రెస్ పార్టీ? ఏపీకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా? అంటూ షర్మిలను వాసిరెడ్డి పద్మ నిలదీశారు. షర్మిల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఆమె చంద్రబాబు రాజకీయంలో ఒక పావుగా మారారని విమర్శించారు.
Advertisement
YS Sharmila
Vasireddy Padma
Jagan
YS Vivekananda Reddy
YSRCP
Congress
Kadapa District

More Telugu News