Congress: స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగించడంతో కాంగ్రెస్ పై మండిపడిన మహారాష్ట్ర నేత

  • మహారాష్ట్రలో శివసేనతో పొత్తును వ్యతిరేకించిన కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్
  • స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగించడంతో పాటు మరిన్ని చర్యలు ఉంటాయన్న కాంగ్రెస్
  • రేపు తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన ఉంటుందన్న సంజయ్ నిరుపమ్
Congress drops Sanjay Nirupam from list of star campaigners

మహారాష్ట్రలో ఇండియా కూటమిలో సీట్ల లొల్లి కొనసాగుతోంది. శివసేనతో పొత్తును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత సంజయ్ నిరుపమ్‌పై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకుంది. ఆయనను స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తొలగించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు మున్ముందు మరిన్ని చర్యలు ఉంటాయని హెచ్చరించింది. రెండు మూడు రోజుల్లో కఠిన నిర్ణయం ఉంటుందని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ తెలిపారు.

నాపై ఎనర్జీ వృథా చేసుకోకండి

కాంగ్రెస్ తనను స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి తొలగించడం, తనపై చర్యలు తీసుకుంటానని చెప్పడంతో సంజయ్ నిరుపమ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తన గురించి శక్తిని వృథా చేసుకోవద్దని ఎద్దేవా చేశారు. పార్టీని కాపాడేందుకు తాను ప్రయత్నం చేశానన్నారు. తాను రేపు తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తానన్నారు.

ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో పొత్తును సంజయ్ నిరుమప్ వ్యతిరేకించారు. ముంబైలోని ఆరు లోక్ సభ సీట్లకు గాను శివసేన ఐదింటిని తీసుకుందని, కానీ కాంగ్రెస్ అలాంటి అవకాశం ఇవ్వవద్దని సంజయ్ నిరుపమ్ సూచించారు. ఇలా చేస్తే నగరంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News