Revanth Reddy: దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టండి.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

  • కాంగ్రెస్ 100 రోజుల పాలనతో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న కేసీఆర్
  • జనగాం, సూర్యాపేట పర్యటనల్లో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ అధినేత
  • మరణించిన రైతుల పేర్లు 48 గంటల్లో బహిర్గతం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్
  • వెంటనే పరిహారం మంజూరు చేస్తానని హామీ
  • కేసీఆర్.. రద్దయిన రూ.వెయ్యి నోటు వంటి వారని ఎద్దేవా
Revanth Reddy dares KCR to give names of farmers who died by suicide

తెలంగాణలో కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపణలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే వాళ్ల పేర్లు బయటపెట్టాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. బలవన్మరణానికి పాల్పడ్డ రైతుల పేర్లను 48 గంటల లోపల బయటపెడితే తాను బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6న జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం రేవంత్ తుక్కుగూడకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. మాజీ సీఎం కేసీఆర్ జనగాం, సూర్యాపేట జిల్లా పర్యటనలపై రేవంత్ స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, ఎంపీలు పార్టీని వీడటం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఈ పర్యటన చేపట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

కేసీఆర్.. రద్దయిపోయిన రూ.1000 నోటు లాంటి వారని, ఆయన ఎవరితో ఉంటే వారు అరెస్టవుతారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌కు అందిన రూ.1500 కోట్ల ఎన్నికల బాండ్ల నిధుల నుంచి రైతులకు రూ.100 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్‌ను రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయంటూ కాంగ్రెస్‌ను నిందించడంపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వానాకాలంలో సరైన వర్షాలు పడలేదని రేవంత్ గుర్తు చేశారు. కాంగ్రెస్ డిసెంబర్‌లో శీతాకాలం ప్రారంభంలో అధికార పగ్గాలు చేపట్టిన విషయాన్ని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్ ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పర్యటనకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించిందని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రతిపక్షాలు నిరసనలు చేపడితే నేతలను అరెస్టు చేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనకు సహకరించిన తమకు ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి నిరాధార ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నించారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుండా ఉండి ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు వచ్చేవారు కాదని అన్నారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోక పోయి ఉంటే, తుంటి విరిగి ఉండకపోతే, తన కూతురు జైలుకు పోకపోయి ఉంటే, కేసీఆర్ ఇప్పటికీ ఎవరికీ అందుబాటులో ఉండేవారు కాదు’’ అని రేవంత్ అన్నారు. ఇక తుక్కుగూడలో జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ మేనిఫెస్టోతో పాటు ఐదు గ్యారెంటీలను కూడా ప్రకటించనున్నారు.

More Telugu News