Rasamai Balakishan: కేశవరావు, కడియం శ్రీహరిలపై రసమయి బాలకిషన్ తీవ్ర విమర్శలు

rasamayi Balakishan fires at KK and Kadiyam Srihari
  • కేకే మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శ
  • కాంగ్రెస్ మొదటి నుంచి తెలంగాణపై విషం చిమ్ముతోందని ఆరోపణ
  • కడియం శ్రీహరి మాదిగ ద్రోహి అన్న రసమయి బాలకిషన్
  • ముసలి నక్కలన్నీ కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నాయని ఎద్దేవా
  • ఎవరో తెలియని కేకే కూతురుని జీహెచ్ఎంసీ మేయర్‌గా చేశామన్న రసమయి
  • పార్టీలో సభ్యత్వం లేని కడియం కావ్యకు టిక్కెట్ ఇచ్చామని వ్యాఖ్య
కె.కేశవరావుపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేశవరావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యమం సమయంలో మిలియన్ మార్చ్‌లో కేశవరావును కోడిగుడ్లతో కొట్టిన ఘటనను మరిచిపోయారా? అని ప్రశ్నించారు. పార్టీలో ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తే వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. ఎవరికీ తెలియని ఆయన కూతురును జీహెచ్ఎంసీ మేయర్‌ని చేశామన్నారు.

కేకే తెలంగాణ కళాకారులను అవమానించేలా మాట్లాడారని... అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతిని అవమానించడం సరికాదన్నారు. కళాకారులకు క్షమాపణలు చెప్పకుంటే ఆయన ఇంటి ముందు ధూమ్ ధామ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం గద్దర్‌ను వాడుకున్నదని ఆరోపించారు. ఆ పార్టీ మొదటి నుంచి తెలంగాణ బతుకుల మీద విషం చిమ్ముతూనే ఉందన్నారు.

కడియం శ్రీహరిపై ఆగ్రహం

కడియం శ్రీహరి మాదిక ద్రోహి అని మండిపడ్డారు. మాదిగ జాతి అంటేనే ఆయనకు కళ్లమంట అని విమర్శించారు. కడియం కారణంగా తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, పసునూరి దయాకర్ వెళ్లిపోయారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. మాదిగలకు సీటు ఇవ్వకుంటే చావు డప్పు కొడతామని హెచ్చరించారు.

ముసలి నక్కలన్నీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు. పార్టీ అధినేత ఆదేశిస్తే తాను వరంగల్ నుంచి పోటీ చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు ఎన్ని సీట్లు ఇచ్చారనే దానిపై మంద కృష్ణ మాదిగ అన్న ఎందుకు మాట్లాడం లేదు? అని  ప్రశ్నించారు. కనీసం పార్టీలో సభ్యత్వం లేని కడియం కావ్యకు కేసీఆర్ టిక్కెట్ ఇస్తే మోసం చేశారన్నారు.
Rasamai Balakishan
Kadiam Srihari
K Keshav Rao
BRS
Congress

More Telugu News