Arunachal China: అరుణాచల్ లోని భూభాగాలకు కొత్త పేర్లు పెట్టిన చైనా

China releases 30 more names for places in Arunachal Pradesh
  • మే 1 నుంచి కొత్త పేర్లతో పిలవాలంటూ వెబ్ సైట్ లో లిస్టు 
  • సరిహద్దులపై వివాదాస్పద ప్రకటన
  • మరోసారి డ్రాగన్ కవ్వింపు చర్యలు 
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై చైనా మరోసారి వివాదాస్పద ప్రకటన చేసింది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తమవేనంటూ, వాటి పేర్లు మారుస్తున్నట్లు పేర్కొంది. ఈమేరకు 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి ఆ లిస్టును ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచింది. ఈ విషయాన్ని డ్రాగన్ కంట్రీ అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఈ పేరు మార్పులు మే 1 నుంచి అమలులోకి వస్తాయని, అప్పటి నుంచి ఆయా ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలని స్పష్టం చేసింది. చైనాకు చెందిన ప్రాంతాలకు విదేశీ పేర్లు ఉండడం వల్ల చైనా సార్వభౌమాధికార హక్కులకు భంగం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది.

అందుకే ఆయా ప్రాంతాలను సొంత భాషలోనే పిలవాలని, విదేశీ భాషల నుంచి మాండరిన్ లోకి తర్జుమా చేయొద్దని తన ప్రజలకు సూచించింది. ఈ క్రమంలోనే విదేశీ పేర్లతో పిలుస్తున్న తమ భూభాగాలకు కొత్త పేర్లను పెడుతున్నట్లు చైనా ప్రభుత్వం పేర్కొందని గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అరుణాచల్ ను దక్షిణ టిబెట్ గా వ్యవహరిస్తూ, జాంగ్నాన్ అని నామకరణం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ చైనా లిస్టు విడుదల చేయడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 2017 నుంచి ఇలా కొత్త పేర్లతో చైనా లిస్ట్ విడుదల చేస్తోంది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా డ్రాగన్ కంట్రీ తేలిగ్గా తీసుకుంటోంది.
Arunachal China
new names
Arunachal Pradesh
border issue

More Telugu News