Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి కేజ్రీవాల్ ను తప్పించాలన్న పిటిషన్ తిరస్కరణ

Delhi High Court rejects plea seeking removal of Arvind Kejriwal from CM post
  • ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
  • కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ ఓ సామాజిక కార్యకర్త పిల్ దాఖలు
  • నేడు విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్
  • కేసులో అరెస్టయిన సీఎంను తొలగించాలని ఎక్కడుందని సూటిగా ప్రశ్నించిన న్యాయస్థానం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన సూర్జిత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త ఈ పిల్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు నేడు తిరస్కరించింది. 

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు ఈ పిల్ నేడు విచారణకు వచ్చింది. అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హుడు అనేందుకు పిటిషనర్ తగిన ప్రామాణిక అంశాలను చూపించలేకపోయారని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. 

"కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రిని తొలగించాలంటున్నారు... ఆ నిబంధన ఎక్కడుందో చూపించండి. మీరు చెబుతున్న న్యాయపరమైన కొలమానం మాకు చూపించండి" అంటూ పిటిషనర్ ను ధర్మాసనం కాస్త గట్టిగానే ప్రశ్నించింది. అంతేకాదు, కేసు దర్యాప్తు ఈ దశలో ఉన్నప్పుడు న్యాయస్థానాల జోక్యానికి అవకాశమే లేదని స్పష్టం చేసింది.
Arvind Kejriwal
Chief Minister
Delhi High Court
Delhi Liquor Scam

More Telugu News