Israel-Hamas War: గాజాలో దయనీయం.. సముద్రంలో జారవిడిచిన సాయం అందుకునేందుకు వెళ్లి 12 మంది మృత్యువాత

12 Gaza residents drown in attempt to reach airdropped aid by US
  • విమానాల ద్వారా సముద్రంలో ఆహార బాక్సులు జారవిడిచిన అమెరికా
  • పారాచూట్లు తెరుచుకోకపోవడంతో నేరుగా ప్రజలపై పడిన డబ్బాలు
  • పారాచూట్ మాల్‌ఫంక్షన్ కారణంగానేనని అమెరికా వివరణ
  • మరణాలకు సంబంధించిన సమాచారం లేదన్న పెంటగాన్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా గాజా ప్రజలు నలిగిపోతున్నారు. తినడానికి తిండిలేక, తాగేందుకు నీళ్లు లేక, తలదాచుకునేందుకు గూడు లేక అల్లాడిపోతున్నారు. ఏ వైపు నుంచి ఏ బాంబు వచ్చి మీద పడుతుందో తెలియక, ఎప్పుడు ఏవైపు నుంచి తుపాకి తూటా వచ్చి గుండెల్లో దిగుతుందో తెలియక ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య వేలు దాటగా తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది.

ఆకాశం నుంచి జారవిడిచిన సాయాన్ని అందుకునేందుకు ప్రయత్నించి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తర గాజాలోని బీట్ లాహియా బీచ్‌లో ఈ ఘటన జరిగింది. అమెరికా విమానాలు ఆకాశం నుంచి పారాచూట్‌ల సాయంతో ఆహారం ఉన్న డబ్బాలను జారవిడిచారు. వాటిని చేజిక్కించుకునేందుకు అప్పటికే సముద్రంలోకి వెళ్లిన ప్రజల్లో 12 మంది డబ్బాలు బలంగా తగలడంతో సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
 
 ఈ ఘటనపై పెంటగాన్ స్పందించింది. 18 బండిల్స్‌లో మూడు పారాచూట్ మాల్‌ఫంక్షన్ కారణంగా తెరుచుకోకపోవడంతో ఈ ఘటన జరిగినట్టు తెలిపింది. అయితే, మరణాలకు సంబంధించి ఎలాంటి సమాచారమూ లేదని పేర్కొంది. గాజా బీచ్‌లో అమెరికా విమానాలు సాయం విడవడం, మృతులను తీరానికి చేరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ వ్యక్తి తన పిల్లల కోసం ఆహారం తెచ్చేందుకు సముద్రంలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. వారు ఆహారాన్ని అలా సముద్రంలో విడిచిపెట్టడం ద్వారా కాకుండా మైదాన ప్రాంతంలో జారవిడిస్తే ఈ విషాదం జరిగి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశాడు.
Israel-Hamas War
Gaza
Airdropped Aid
USA
Gaza Beach

More Telugu News