Venkatagiri: వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వద్దంటూ భారీ బైక్ ర్యాలీ

Bike rally in Venkatagiri against Nedurumalli Ramkumar Reddy candidature
  • వెంకటగిరి టికెట్ ను నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి ఇచ్చిన వైసీపీ
  • భగ్గుమన్న అసంతృప్తులు
  • సేవ్ వెంకటగిరి అంటూ బైక్ ర్యాలీలో పాల్గొన్న వ్యతిరేక వర్గం
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం వైసీపీలో వర్గ పోరు భగ్గుమంది. వైసీపీ హైకమాండ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి వెంకటగిరి అసెంబ్లీ స్థానం టికెట్ కేటాయించింది. అయితే, రాంకుమార్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీలో మరో వర్గం నేడు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టింది. 

వైసీపీ అసంతృప్త నేతలు, కార్యకర్తలు 'సేవ్ వెంకటగిరి' అంటూ  నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు, రాంకుమార్ రెడ్డిని కొనసాగిస్తే, తాము ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనంజరెడ్డి స్పష్టం చేశారు. 

ర్యాలీ అనంతరం వైసీపీ అసంతృప్త నేతలు వెంకటగిరిలో ఓ కల్యాణమండపంలో సమావేశమై అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ కోసం ఎప్పటినుంచో పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి, రాంకుమార్ రెడ్డి తన సొంత బ్యాచ్ తో వెంకటగిరి నియోజకవర్గ వ్యవహారాలు నడపడం దారుణమని అభిప్రాయపడ్డారు.

వెంకటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ రావు, పెంచలకోన ఆలయ కమిటీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి, బాలాయపల్లి ఎంపీపీ భాస్కర్ రెడ్డి, పెద్దసంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Venkatagiri
Nedurumalli Ramkumar Reddy
YSRCP

More Telugu News