Mudragada Padmanabham: సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు?: పవన్ పై ముద్రగడ ఫైర్

Mudragada slams Pawan Kalyan
  • ఇటీవల వైసీపీలో చేరిన ముద్రగడ
  • చిరంజీవి బాటలోనే పవన్ కూడా జెండా ఎత్తేస్తాడని ఎద్దేవా
  • పిఠాపురంలో పవన్ ఓడిపోవడం ఖాయమని వెల్లడి
  • చంద్రబాబు, పవన్ ల ఓటమికి కృషి చేస్తానని స్పష్టీకరణ 

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ... జనసేనాని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. సినిమా వాళ్లకు రాజకీయాలెందుకు? అని ఎత్తిపొడిచారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొద్దికాలంలోనే జెండా ఎత్తేశారని, పవన్ కల్యాణ్ కూడా అందుకు మినహాయింపు కాదని అన్నారు. 

సినిమా వాళ్లు రాజకీయాలకు పనికిరారని అభిప్రాయపడ్డారు. మా ఇంటికొస్తే ఏం తెస్తారు... మీ ఇంటికి వస్తే ఏమిస్తారు?... అన్న చందంగా సినిమా వాళ్ల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు. 

పిఠాపురంలో పవన్ ఓడిపోవడం పక్కా అని ముద్రగడ స్పష్టం చేశారు. తనను చంద్రబాబు ఎంతో బాధపెట్టాడని, తనకు శత్రువు అయిన చంద్రబాబుతో పవన్ కలవడం తనకు నచ్చలేదని అన్నారు. ఎన్నికల్లో పవన్, చంద్రబాబుల ఓటమికి కృషి చేస్తానని చెప్పారు. నా శత్రువులతో చేతులు కలిపిన వ్యక్తి నీతులు చెబితే నేను వినాలా? అని మండిపడ్డారు. 21 సీట్లకు సర్దుబాటు చేసుకున్న పవన్ కు నేనెందుకు మద్దతు ఇవ్వాలి? అని ముద్రగడ ప్రశ్నించారు.

 ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు... అలాంటి పార్టీలోకి నేను వెళ్లాలా? అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News