Kejriwal Arrest: జైలు నుంచి గ్యాంగులను నడుపుతారు.. ప్రభుత్వాలను కాదు: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ

  • జైలు నుంచే ఢిల్లీని పాలిస్తానన్న కేజ్రీవాల్ ప్రకటనపై మండిపడ్డ ఎంపీ
  • ఢిల్లీని కేజ్రీవాల్ దోచుకున్నాడని ఆరోపణ
  • ఆయన అరెస్టయితే జనం స్వీట్లు పంచుకున్నారని వెల్లడి
Gangs Run From Jail Not Government BJP MP Manoj Tiwari Fired On AAP leaders

జైలుకు వెళ్లినా సరే కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతల ప్రకటనపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మండిపడ్డారు. ఈడీ కస్టడీకి వెళుతూ సీఎం పదవికి రాజీనామా చేయబోనని, జైలు నుంచే పాలన కొనసాగిస్తానని కేజ్రీవాల్ చెప్పడాన్ని తివారీ తప్పుబట్టారు. ఈమేరకు శనివారం ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. జైలు నుంచి గ్యాంగులను నడుపుతారు కానీ ప్రభుత్వాన్ని కాదని ఆప్ నేతలపై విమర్శలు గుప్పించారు. ఇంత జరిగినా ఆప్ నేతలు కొంచెం కూడా మారలేదని మండిపడ్డారు. 

ఆప్ ప్రభుత్వం ఢిల్లీని, ఢిల్లీ ప్రజలను కష్టాల్లోకి నెట్టిందని ఆరోపించారు. దోచుకోవడం తప్ప కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీకి చేసిందేమీ లేదని విమర్శించారు. అందుకే ఆయన అరెస్టుపై ఆప్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు కానీ ప్రజలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారని తివారీ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ జైలు నుంచే నడిపిస్తారని పదే పదే చెబుతున్న ఆప్ నేతలు (పరోక్షంగా ఢిల్లీ మంత్రి అతిషిని ఉద్దేశిస్తూ) తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. జైలు నుంచి నడిపించేది గ్యాంగులనే తప్ప ప్రభుత్వాలను కాదని అన్నారు.

అంతకుముందు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో కేజ్రీవాల్ పాత్ర తొందర్లోనే బయటపడుతుందని చెప్పారు. కోర్టు విచారణ సందర్భంగా కేజ్రీవాల్ న్యాయమూర్తికి చేసిన విజ్ఞప్తిని ప్రస్తావిస్తూ.. తాను ఢిల్లీ ముఖ్యమంత్రిని కాబట్టి తనకు రెండు నెలల సమయం ఇవ్వాలని కోరాడని వివరించారు. అయితే, దేశంలో చట్టం అనేది ఒకటుందని, హోదాలతో సంబంధంలేకుండా నేరస్థులందరినీ సమానంగా చూస్తుందని చెప్పారు.

More Telugu News