Allu Arjun: అవసరమైతే అల్లు అర్జున్ నాకు మద్దతుగా ప్రచారం చేస్తారు!: కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి

Chandrasekhar Reddy about Allu Arjun campaign
  • ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న చంద్రశేఖర్ రెడ్డి
  • ఆ సమయంలో పరిస్థితిని బట్టి అర్జున్ ప్రచారానికి వస్తారని వ్యాఖ్య
  • తనకు మల్కాజ్‌గిరి లేదా భువనగిరి ఇచ్చినా పోటీ చేస్తానని వెల్లడి
  • కోమటిరెడ్డి సోదరుల మద్దతు ఉంటుందని ధీమా

తనకు మల్కాజ్‌గిరి లేదా భువనగిరి టిక్కెట్ ఇచ్చిన పర్వాలేదని... ఆ సమయంలో అవసరమైతే అల్లు అర్జున్ తనకు మద్దతుగా ప్రచారం చేస్తారని స్టైలిష్ స్టార్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయనతో టీవీ9 ఛానల్ మీడియా ప్రతినిధి ముఖాముఖి నిర్వహించారు. అల్లు అర్జున్ మీకు మద్దతుగా ప్రచారం చేస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.

దానికి చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ... ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, అదే సమయంలో అల్లు అర్జున్ సహా తన కుటుంబం తనకు మద్దతుగా ఉంటుందన్నారు. ప్రజలే కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారన్నారు. ఆ సమయంలో (టిక్కెట్ ఇచ్చాక) పరిస్థితిని బట్టి అల్లు అర్జున్ ప్రచారానికి వచ్చే అవకాశముంటుందన్నారు. అయినప్పటికీ ఈ రోజు ఎవరు వచ్చినా... ఎవరు రాకపోయినా ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు.

మెగా ఫ్యామిలీ ఇంతకుముందు రాజకీయాల్లో ఉందని, పవన్ కల్యాణ్ పార్టీని నడిపిస్తున్నారని, కాబట్టి తాము కలిసినప్పుడు రాజకీయాలపై చర్చ సాగుతుందన్నారు. రాజకీయాలు అందరికీ అవసరమే అన్నారు. రేవంత్ రెడ్డి పాలనపై సినిమా పరిశ్రమ కూడా ప్రశంసలు కురిపిస్తోందన్నారు. 

భువనగిరి ఇచ్చినా పోటీ చేస్తాను

తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో మల్కాజ్‌గిరి టిక్కెట్ ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పారని, అందుకే అక్కడ కొన్నిరోజులుగా పలు కార్యక్రమాలు చేపట్టానన్నారు. ఒకవేళ భువనగిరి ఇచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మల్కాజ్‌గిరి... భువనగిరిలో ఏ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని చెప్పారు. తనకు భువనగిరి టిక్కెట్ ఇస్తే కోమటిరెడ్డి సోదరుల సహకారం తనకు ఉంటుందన్నారు.

మల్కాజ్‌గిరి టిక్కెట్ సునీతా మహేందర్ రెడ్డికి వస్తుందనే ప్రచారం జరగడంతో తాను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలను కలిశానన్నారు. అందుకే భువనగిరి టిక్కెట్ తనకు ఇస్తే కోమటిరెడ్డి సోదరులతో పాటు ఇతర ఎమ్మెల్యేల సహకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు రెండింట్లో ఏ నియోజకవర్గాన్ని కేటాయించినా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News