Nara Lokesh: బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్... కుంచనపల్లి అపార్ట్ మెంట్ వాసులతో లోకేశ్ ముఖాముఖి

Nara Lokesh held Breakfast with Lokesh with Kunchanapalli apartment residents
  • మంగళగిరి నియోజకవర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్న లోకేశ్
  • జగన్ అరాచకపాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని విమర్శ 
  • అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులనూ వేధించారని ఆగ్రహం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన తన సొంత నియోజకవర్గంపై తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. వివిధ వర్గాల ప్రజలను, తటస్థ ప్రముఖులను కలుస్తూ క్రమంగా మద్దతు పెంచుకుంటున్నారు. 

తాజాగా, 'బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేశ్' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కుంచనపల్లి అపార్ట్ మెంట్ వాసులతో సమావేశం అయ్యారు. వారితో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తానో స్పష్టంగా చెప్పారు. ఈ క్రమంలో లోకేశ్ సీఎం జగన్ పైనా విమర్శనాస్త్రాలు సంధించారు. 

జగన్ అరాచకపాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, జె-ట్యాక్స్, కక్షపూరిత విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అమర్ రాజా వంటి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయని అన్నారు. 

"2014లో రాష్ట్ర విభజన తర్వాత కనీసం నిలువ నీడ కూడా లేని ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు అహోరాత్రులు శ్రమించి గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు దీటుగా తీర్చిదిద్దారు. ఒక్క ఛాన్స్ మాయలో పడి జగన్ ను గెలిపించినందుకు నేడు 5 కోట్ల మంది ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. 

2019లో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జగన్ దెబ్బకు, వెనుకబడిన రాష్ట్రాలకైనా వెళతాం తప్ప ఏపీకి వెళ్లబోమనే పరిస్థితికి పారిశ్రామికవేత్తలు వచ్చారు. 

దేశంలో వ్యాక్సిన్ తయారీలో అగ్రగామి సంస్థగా ఉన్న భారత్ బయోటెక్ ఒరిస్సాలో తమ యూనిట్ ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఖజానాకు అత్యధికంగా పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చే అమర్ రాజాను వేధించడంతో తెలంగాణాకు వెళ్లి యూనిట్ స్థాపించారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయింది ఏపీలోని చదువుకున్న నిరుద్యోగ యువత. రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఈ ఆరాచక విధానాలకు ఓటు ద్వారా చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. 

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక్కో ఫోకస్ సెక్టార్ ను ఏర్పాటుచేసి ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు. అనంతపురంలో ఆటోమొబైల్, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, కర్నూలులో సోలార్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, గోదావరి జిల్లాల్లో ఆక్వా, పామాయిల్... ఇలా ప్రతి జిల్లాకు అక్కడ ఉన్న వనరులను గుర్తించి పరిశ్రమలను ప్రోత్సహించారు. చంద్రబాబు హయాంలో 40 వేల పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని జగన్ ప్రభుత్వమే చెప్పింది. 

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు నడిపించాలన్నది టీడీపీ విధానం. అభివృద్ధి చేయకుండా ఎడాపెడా అప్పులు చేయడంవల్ల ఆ భారం రాష్ట్ర ప్రజలంతా మోయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది ఇదే. సంక్షోభాలను సవాల్ గా స్వీకరించి అభివృద్ధికి బాటలు వేయడం చంద్రబాబు గారికి వెన్నతోపెట్టిన విద్య. 

1995, 2014లో కూడా గడ్డు పరిస్థితుల్లోనే రాష్ట్ర పగ్గాలు చేపట్టిన చంద్రబాబునాయుడు అవిశ్రాంతంగా శ్రమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలెక్కించారు. జగన్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్రాన్ని ఎన్నికలయ్యాక చంద్రబాబునాయుడు కచ్చితంగా గాడిలో పెడతారు. 

రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమైంది, వారు పనిచేసే ఆఫీసుల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులను కూడా దొంగలుగా చిత్రీకరించి వేధింపులకు గురిచేశారు. పదవీ విరమణ చేసినవారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి సౌకర్యాలతో సొంతభవనాలు నిర్మిస్తాం" అని లోకేశ్ వివరించారు.
Nara Lokesh
Breakfast With Lokesh
Kunchanapalli
Apartment Residents
Mangalagiri
TDP

More Telugu News