Pakistan Super League: ‘పాకిస్థాన్ సూపర్ లీగ్’ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Pakistan Super League Prize Money very when compares To WPL And IPL
  • పీఎస్ఎల్ విజేత ఇస్లామాబాద్ యునైటెడ్‌కు రూ.4.13 కోట్ల ప్రైజ్ మనీ అందజేత
  • గతేడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచి రూ.20 కోట్లు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్
  • రూ.6 కోట్ల ప్రైజ్ మనీ చెక్ అందుకున్న డబ్ల్యూపీఎల్ విన్నర్‌ ఆర్సీబీ
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగిన టీ20 లీగ్‌లలో ఒకటైన పాకిస్థాన్ సూపర్ లీగ్ -2024 ఇటీవలే ముగిసింది. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండు రోజుల క్రితమే భారత్ వేదికగా జరిగిన ‘ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‘(డబ్ల్యూపీఎల్2024) కూడా ముగిసింది. ఇక శుక్రవారం నుంచి ఐపీఎల్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టీ20 లీగ్‌ల ప్రైజ్‌మనీలు ఎంత అనేది ఆసక్తికరంగా మారింది.

పీఎస్ఎల్ 2024 టైటిల్‌ను గెలుచుకున్న ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు 14 కోట్ల పాకిస్థానీ రూపాయల ప్రైజ్‌మనీని అందుకుంది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.4.13 కోట్లుగా ఉంది. ఇక పీఎస్‌ఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన ‘ముల్తాన్ సుల్తాన్స్’ జట్టు 5.6 కోట్ల పాకిస్థాన్ రూపాయల (భారత కరెన్సీలో రూ.1.65 కోట్లు) నగదును అందుకుంది. అయితే భారత్ వేదికగా జరుగుతున్న టీ20 లీగ్‌లతో పోల్చితే పీఎస్ఎల్ ప్రైజ్ మనీ తక్కువగా ఉంది. గతేడాది ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏకంగా రూ.20 కోట్ల చెక్‌ను అందుకుంది. ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ రూ.13 కోట్లు అందుకుంది. 

ఇక ఇటీవలే ముగిసిన డబ్ల్యూపీఎల్ టైటిల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ.6 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 3 కోట్లు ప్రైజ్ మనీ చెక్ అందుకుంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే భారత్ వేదికగా జరుగుతున్న టీ20 లీగ్‌ల ప్రైజ్‌మనీ ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది. ఇక పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు ఆదరణ ఉన్నప్పటికీ ఆర్థికంగా అంత బలంగా లేదని స్పష్టమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ ఆధ్వర్యంలో ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ లీగ్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Pakistan Super League
PSL2024
WPL
IPL
Cricket

More Telugu News