Mudragada Padmanabham: ఎన్నికల తర్వాత జనసేన క్లోజ్ కావడం ఖాయం: ముద్రగడ పద్మనాభం

Pawan Kalyans Jansena will be closed after elections says Mudragada Padmanabham
  • గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్లా ఓడిపోయారని ముద్రగడ ఎద్దేవా
  • పవన్ కు రాజకీయాలు తెలియవన్న ముద్రగడ
  • రాజకీయాల్లో సినిమా వాళ్లను నమ్మే రోజులు పోయాయని వ్యాఖ్య 

కాపు నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ... పవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో, ఆయన చివరకు వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఈరోజు ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ... పవన్ పై విమర్శలు గుప్పించారు. పవన్ ను మార్చాలని తాను ఎంతో ప్రయత్నించానని చెప్పారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయారని... ఈ ఎన్నికల్లో కేవలం 21 సీట్లకే పరిమితమయ్యారని అన్నారు. ఈ 21 సీట్లలో ఎన్ని గెలుస్తారో పవన్ కే తెలియదని చెప్పారు. 

పవన్ కు రాజకీయం తెలియదని ముద్రగడ అన్నారు. ఎన్నికల తర్వాత జనసేన క్లోజ్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాజకీయాల్లో సినిమా వాళ్లను నమ్మే రోజులు పోయాయని అన్నారు. ఏదో ఆశించి తాను వైసీపీలో చేరలేదని... రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలపడాలని, కాపులు ఆనందంగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని అన్నారు.

మొలతాడు లేనోళ్లు, లాగు లేనోళ్లు తనకు రాజకీయాలు నేర్పుతారా.. చాలా తప్పు అని ముద్రగడ అన్నారు. కాపుల కోసమే కాకుండా, దళితల కోసం కూడా తాను ఉద్యమించానని చెప్పారు. తనపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారని, తాను పట్టించుకోనని అన్నారు. సినిమాల్లో పవన్ హీరో అయితే... రియల్ లైఫ్ లో తానే హీరో అని చెప్పారు. సీఎం జగన్ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని అన్నారు. వైసీపీ వ్యవస్థాపకుల్లో తాను కూడా ఒకడినని... అయితే కొన్ని శక్తులు తనను జగన్ కు దూరం చేశాయని చెప్పారు. జగన్ ఆదేశిస్తే వైసీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధమని అన్నారు.

  • Loading...

More Telugu News