Bode Prasad: నాకు టికెట్ లేదనడంతో గుండె పిండేసినట్టయింది: టీడీపీ నేత బోడె ప్రసాద్

  • పెనమలూరు టీడీపీ టికెట్ పై రగడ
  • టికెట్ లేదని బోడె ప్రసాద్ కు సమాచారం ఇచ్చిన టీడీపీ
  • పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానన్న బోడె ప్రసాద్
  • టికెట్ లేదని చెప్పడం మనసును కలచివేసిందని వెల్లడి
Bode Prasad said he feels so pain after TDP rejects Penamaluru ticket

పెనమలూరు టికెట్ పై ఆశలు పెంచుకున్న టీడీపీ నేత బోడె ప్రసాద్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ లేదని టీడీపీ హైకమాండ్ ఆయనకు సమాచారం ఇవ్వడమే అందుకు కారణం. టికెట్ వస్తుందని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని, కానీ టికెట్ లేదని చెప్పడంతో నిజంగా ఎంతో బాధగా ఉందని అన్నారు. టికెట్ ఇవ్వకపోవడంతో గుండె పిండేసినట్టయిందని వ్యాఖ్యానించారు. 

తాను చంద్రబాబునాయుడి భక్తుడ్నని బోడె ప్రసాద్ ఉద్ఘాటించారు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నానని, ఎక్కడా చిన్న అవినీతి మరక కూడా అంటించుకోలేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వ్యతిరేక గాలి వల్లో, జగన్ పై ప్రజల్లో ఉన్న సానుభూతి కారణంగానో ఓటమి పాలయ్యానని బోడె ప్రసాద్ వెల్లడించారు. తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని ప్రజల మధ్యకు వెళ్లి చెప్పానని, ప్రజల్లోనే ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. 

పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం తు.చ తప్పకుండా నిర్వర్తించానని, ఒక్క రూపాయి కూడా ఎవరినీ అర్థించకుండా, తన సొంత డబ్బులు ఖర్చు చేశానని బోడె ప్రసాద్ వివరించారు. ఆస్తులు ఉన్నా, లేకపోయినా సంవత్సరానికి ఒక కోటి రూపాయలు ఖర్చు చేస్తూ పెనమలూరులో టీడీపీని నిలబెట్టుకుంటూ వచ్చానని పేర్కొన్నారు. 

స్థానిక ఎన్నికల్లో సుమారుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టానని, లోకేశ్ పాదయాత్రలో ఎంత ఖర్చు పెట్టి ఎంత విజయవంతం చేశామో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఈ రాష్ట్రంలోనే ఒక రికార్డు సృష్టించామని తెలిపారు. 

"మొన్న దళితగర్జన, తాడేపల్లిగూడెం సభ, గుడివాడ సభ... చంద్రబాబు ఆదేశించిన ఏ కార్యక్రమం అయినా విజయవంతం అయ్యేలా పెనమలూరు టీడీపీ నుంచి నా సహకారం అందించాను. పెనమలూరు టీడీపీ శ్రేణులు, ప్రజలు నేను ఏ పిలుపు ఇచ్చినా ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమం విజయవంతం చేశారు. 

ఈ నెల 17న చిలకలూరిపేటలో సభ నేపథ్యంలో మీకు తగిన ఏర్పాట్లు చేయలేకపోతున్నామని చంద్రబాబు గారు చెప్పమన్నారు అంటూ టీడీపీ నుంచి సమాచారం అందింది. ఈ నాలుగున్నరేళ్లలో నేనేమైనా తప్పు చేశానా? లేకపోతే ఈ నియోజకవర్గంలో సర్వేలు నాకు అనుకూలంగా లేవా? నాకు టికెట్ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయసేకరణ ఎందుకు జరిపారు? 

సర్వేలన్నీ బాగున్నాయి, ఐవీఆర్ఎస్ లో కూడా 86 శాతం బోడె ప్రసాద్ కు అనుకూలంగా వచ్చిందని అందరూ చెప్పారు.  పార్టీ కోసం కొన్నిసార్లు కుటుంబంతో గడపలేని క్షణాలు కూడా ఉన్నాయి. భార్య చీర కొనాలి, నగ కొనాలి అని అంటే, ముందు పార్టీని గెలిపించుకోవాలి... ఆ తర్వాత కొనుక్కుందాంలే అని పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టాను. 

నేను ఓడిపోయినప్పుడు కూడా బాధపడలేదు కానీ, పెనమలూరు నుంచి నీకు అవకాశం లేదని చెప్పడంతో నిజంగా మనసు కలచివేసింది" అని బోడె ప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News