Pulaparthi Anjaneyulu: పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన భీమవరం మాజీ ఎమ్మెల్యే

Pulaparthi Anjaneyulu joins Janasena Party
  • పులపర్తి ఆంజనేయులుకు జనసేన కండువా కప్పిన పవన్ కల్యాణ్
  • పార్టీలోకి సాదర స్వాగతం
  • పవన్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరానన్న పులపర్తి 
ఎన్నికల సమయం కావడంతో పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు (అంజిబాబు) నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. 

మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పులపర్తి ఆంజనేయులుకు పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పారు. జనసేన పార్టీలోకి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పులపర్తి ఆంజనేయులు మాట్లాడుతూ, పవన్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరానని వెల్లడించారు. 

సమాజం బాగుండాలన్న ఆకాంక్షతో పవన్ కల్యాణ్ ఎంతో త్యాగం చేశారని కొనియాడారు. ఏపీలో ఎన్నికల వేళ మూడు పార్టీల కలయిక కోసం పవన్ తీవ్రంగా కృషి చేశారని వివరించారు. గత ఐదేళ్లుగా భీమవరం ప్రజలు నరకం అనుభవిస్తున్నారని, ఈ పరిస్థితి పోవాలంటే కూటమి గెలవాలని అన్నారు.

ఇటీవల పవన్ కల్యాణ్ భీమవరంలో పర్యటించినప్పుడు పులపర్తి ఆంజనేయులు నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగానే ఆంజనేయులు జనసేనలో చేరాలన్న ఆకాంక్షను పవన్ ఎదుట వ్యక్తపరిచారు. అందుకు జనసేనాని సానుకూలంగా స్పందించారు.
Pulaparthi Anjaneyulu
Janasena
Pawan Kalyan
Bhimavaram

More Telugu News