Mallu Bhatti Vikramarka: భట్టివిక్రమార్క కుర్చీలో దర్జాగా కూర్చోగా... నేలమీద కూర్చొని రాహుల్ గాంధీ ప్లేట్‌లోని దోశను లాగిస్తున్న కోమటిరెడ్డి ఫొటో వైరల్

Congress counter photos over Yadadri Mallu Bhatti Vikramarka issue
  • కాంగ్రెస్ అంటేనే ఆకాశమంతా సమానత్వమంటూ ట్వీట్
  • రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క పక్క పక్కనే కూర్చొని సరదాగా ముచ్చటించుకుంటున్న మరో ఫొటోను ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్
  • యాదగిరిగుట్టలో భట్టివిక్రమార్క ఇష్యూకు కౌంటర్ ఇస్తోన్న తెలంగాణ కాంగ్రెస్
యాదగిరిగుట్టలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానించారని బీఆర్ఎస్ నాయకులు చేస్తోన్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ దీటుగా స్పందిస్తోంది. యాదగిరిగుట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్టూల్స్‌పై కూర్చోగా, భట్టివిక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కింద కూర్చున్నారు. దీంతో... దళితులు, వెనుకబడిన వర్గాల వారిని కాళ్ల వద్ద కూర్చోబెట్టుకున్నారని బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు.

యాదగిరిగుట్టలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు సీఎం పక్కన ఉన్నారని, భద్రాద్రిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నారని వివరించారు.

సోషల్ మీడియాలో యాదగిరిగుట్టను ట్రోల్ చేస్తుండటంతో కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ భట్టివిక్రమార్క పైన కూర్చొని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు కింద కూర్చున్న ఫొటోను షేర్ చేసింది. బీఆర్ఎస్ నాయకులకు రెండు ఫొటోలు పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చింది.

అందులో ఓ ఫొటోలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లు భట్టి విక్రమార్కలు పక్క పక్కన కుర్చీల్లో కూర్చొని ఉండగా... కోమటిరెడ్డి వెంకట రెడ్డి కింద కాళ్లపై కూర్చొని రాహుల్ గాంధీ చేతిలోని దోశను ఆరగిస్తున్నట్లుగా ఉంది. 'కాంగ్రెస్ అంటేనే ఆకాశమంతా సమానత్వం' అని పేర్కొంది. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

మరో ట్వీట్‌లో రేవంత్ రెడ్డి కాలుమీద కాలు వేసుకొని ఉండగా, మల్లు భట్టి విక్రమార్క మీసాలు దువ్వుతున్నట్లుగా ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఇందులో వారిద్దరు నవ్వుతూ సరదాగా ముచ్చటించుకుంటున్నారు. 'తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని... తరిమేవాళ్ళను హితులుగా తలిచి ముందుకెళ్లాలని' అని ట్వీట్ చేసింది.
Mallu Bhatti Vikramarka
Komatireddy Venkat Reddy
Revanth Reddy
Congress

More Telugu News