General Elections-2024: సార్వత్రిక ఎన్నికల కోసం కసరత్తులకు తెరలేపిన కేంద్ర ఎన్నికల సంఘం 

Election Commission of India starts election procedures
  • దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు
  • ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో నేడు కీలక సమావేశం
  • ఎన్నికల పరిశీలకులకు దిశానిర్దేశం చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్

దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులకు తెరలేపింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో నేడు కీలక సమావేశం నిర్వహించింది. 

దేశవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పనిచేసే పరిశీలకులకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక సూచనలు చేశారు. పోలింగ్ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వాహణలో పరిశీలకులది కీలకపాత్ర అని తెలిపారు. నిబంధనలను పాటించే విధంగా అబ్జర్వర్లకు దిశానిర్దేశం చేశారు. 

కాగా, కేంద్ర ఎన్నికల సంఘంలో రెండు కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు. 

సెర్చ్ కమిటీ పరిశీలనలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాధా చౌహాన్, మరికొందరి పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15 నాటికి ఎన్నికల కమిషనర్ల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సెర్చ్ కమిటీ ప్రస్తుతం ఐదుగురి పేర్లతో జాబితా రూపొందించే పనిలో ఉంది. సెర్చ్ కమిటి సిఫారసుల మేరకు సెలెక్ట్ కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనుంది. 

అటు, ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లోక్ సభ ఎన్నికలు కొన్ని వారాల్లో జరగనుండగా, కేంద్ర ఎన్నికల సంఘంలో పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

  • Loading...

More Telugu News