Krystyna Pyszkova: ‘మిస్ వరల్డ్ 2024’ విజేత క్రిస్టీనా పిస్కోవాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇవే!

All you need to know about Miss World 2024 winner Krystyna Pyszkova
  • చిన్నప్పటి నుంచి ప్రతిభావంతురాలిగా గుర్తింపు తెచ్చుకున్న చెక్ రిపబ్లిక్ భామ
  • గతంలో మిస్ యూరప్ అవార్డును దక్కించుకున్న క్రిస్టీనా
  • చిన్న వయసు నుంచే సేవాభావ దృక్పథాన్ని చాటుకుంటున్న వైనం
  • వెనుకబడిన వర్గాల పిల్లల కోసం టాంజానియాలో స్కూల్‌ని ఏర్పాటు చేసిన క్రిస్టీనా పిస్కోవా
దాదాపు 28 ఏళ్ల తర్వాత భారత్‌లోని ముంబై వేదికగా జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్‌ రిపబ్లిక్ దేశానికి చెందిన 24 ఏళ్ల క్రిస్టీనా పిస్కోవా విజేతగా నిలిచారు. 115 దేశాలకు చెందిన అందగత్తెలు పోటీపడగా ఆమె విజేతగా నిలిచారు. ఈ నేపథ్యంలో క్రిస్టీనా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. చెక్‌ రిపబ్లిక్‌లో ట్రినెక్ నగరంలో జన్మించారు. ఆ తర్వాత వారి కుటుంబం దేశ రాజధాని ప్రాగ్‌కు మకాం మార్చింది. చిన్నప్పటి నుంచి ఆమె చాలా ప్రతిభావంతురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ పనినైనా సంకల్పం, పట్టుదలతో చేస్తారని పేరుంది. మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా ఎంతో నిబద్ధతో కష్టపడి సాధించారు. ఆమె కెరియర్‌లో అసాధారణ విజయాలు ఉన్నాయి. మిస్ యూరప్ టైటిల్‌ను కూడా సంపాదించారు. ప్రతిష్ఠాత్మక ‘ఉత్తమ ఫ్యాషన్ డిజైనర్ అవార్డ్ - యూరప్’ అవార్డును కూడా దక్కించుకున్నారు.

సామాజిక సేవా కార్యక్రమాల్లో క్రిస్టీనా పిస్కోవా చాలా చురకుగా ఉంటారు. తన సేవా కార్యక్రమాల కోసం ‘క్రిస్టీనా పిస్కో ఫౌండేషన్’ను ఏర్పాటు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన చిన్నారులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో టాంజానియాలో ఓ స్కూల్‌ని ఏర్పాటు చేశారు. ఈ స్కూలు పిల్లలు, వృద్ధులు, మానసిక వికలాంగులకు కూడా సేవలు అందిస్తోంది. అట్టడుగు వర్గాలను ఉద్ధరించాలనే నిబద్ధతతో ఆమె పనిచేస్తుంటారు. చదువు విషయానికి వస్తే క్రిస్టీనా పిస్కోవా.. డ్యుయెల్ డిగ్రీలో లా, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. అయితే మోడలింగ్‌పై ఆసక్తితో ఆ దిశగా అడుగులు వేసి నిబద్ధతతో ముందుకెళ్లారు. 2022లో లండన్‌లోని ‘ఎలైట్ మోడల్ మేనేజ్‌మెంట్‌లో చేరి చాలా విషయాలపై అవగాహన పెంచుకున్నారు. అదే ఏడాది నిర్వహించిన ‘మిస్ చెక్ రిపబ్లిక్’ పోటీల్లో పాల్గొని మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు.
Krystyna Pyszkova
Miss World 2024
czech republic

More Telugu News