Gudivada Amarnath: బీజేపీకి ఓటు వేస్తే జగన్ కు వేసినట్టేనని గతంలో చంద్రబాబు అనలేదా?: ఏపీ మంత్రి అమర్నాథ్

Minister Amarnath slams Chandrababu over alliance
  • బీజేపీతో టీడీపీ-జనసేన పొత్తు ఖరారు
  • చంద్రబాబుపై మంత్రి అమర్నాథ్ విమర్శలు
  • జగన్ ను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుంటున్నారని వెల్లడి

బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు కుదరడంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శనాత్మకంగా స్పందించారు. కేఏ పాల్ పార్టీతో తప్ప చంద్రబాబు అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. పొత్తుల పేరుతో చంద్రబాబు ఎవరితో ఎలాంటి సంబంధం అయినా పెట్టుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓటు జగన్ కే పోతుందని గతంలో చంద్రబాబు అనలేదా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. బీజేపీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని గతంలోనే చెప్పామని అన్నారు. తమకు పొత్తులతో అవసరం లేదని, ప్రజలతోనే తమ పొత్తు అని స్పష్టం చేశారు.

మేం చేసిన అభివృద్ధి చూసి ఓటేయమని జగన్ చెబుతుంటే... మా పొత్తులు చూసి ఓటేయండని చంద్రబాబు, పవన్ కల్యాణ్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు మేం సిద్ధం అని జగన్ అంటున్నారు... అమిత్ షా ఇంటి ముందు పొత్తులకు మేం సిద్ధం అని చంద్రబాబు, పవన్ అంటున్నారు అని ఎత్తిపొడిచారు. సీఎం జగన్ ను ఎదుర్కోవడం చేతకాక పొత్తులు పెట్టుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ విపక్ష నేతలను విమర్శించారు.

  • Loading...

More Telugu News