BCCI: టీమిండియా టెస్టు ఆటగాళ్లకు భారీ మొత్తంలో అదనపు ప్రోత్సాహకం... ఎందుకంటే...!

BCCI announces new incentive scheme for Team India test cricketers
  • టెస్టు క్రికెట్ వైపు ఆటగాళ్లను ఆకర్షించేందుకు బీసీసీఐ కొత్త పథకం
  • ఓ సీజన్ లో ఆడే టెస్టుల సంఖ్య ఆధారంగా ప్రోత్సాహక నగదు
  • ప్రకటన చేసిన జై షా 
టీ20 ఫార్మాట్ రంగప్రవేశంతో టెస్టు క్రికెట్ కళ తప్పిందన్న వాదనలు లేకపోలేదు. చాలామంది అగ్రశ్రేణి ఆటగాళ్లు టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పి, వైట్ బాల్ క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపుతుండడమే అందుకు నిదర్శనం. టెస్టు మ్యాచ్ లు చూసేందుకు స్టేడియానికి వచ్చే వీక్షకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో, టీ20 క్రికెట్ మోజులో టెస్టు క్రికెట్ పట్ల ఆసక్తి చూపని టీమిండియా ఆటగాళ్లను ఆకర్షించేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంటోంది. 

టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్ పేరిట టీమిండియా టెస్టు ఆటగాళ్లకు అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఇవాళ బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశారు. ఈ ఇన్సెంటివ్ స్కీమ్ ప్రకారం... బీసీసీఐ కాంట్రాక్టు జాబితాలో ఉన్న ఆటగాళ్లకు టెస్టుమ్యాచ్ ఫీజుతో పాటు అదనంగా ప్రోత్సాహక నగదును కూడా అందిస్తారు. 

ఓ సీజన్ లో 50 శాతం కంటే ఎక్కువ టెస్టుల్లో తుది జట్టులో ఉన్న ఆటగాళ్లకు ప్రతి మ్యాచ్ కు ప్రోత్సాహకం కింద ఫీజుకు అదనంగా రూ.30 లక్షలు లభిస్తాయి. ఓ సీజన్ లో 50 శాతం కంటే ఎక్కువ టెస్టుల్లో రిజర్వ్ బెంచ్ లో ఉన్న ఆటగాళ్లకు మ్యాచ్ కు రూ.15 లక్షలు ఇస్తారు. 

ఓ సీజన్ లో 75 శాతం కంటే ఎక్కువ టెస్టుల్లో తుది జట్టులో ఉన్న ఆటగాళ్లకు మ్యాచ్ కు రూ.45 లక్షల చొప్పున ఇస్తారు. అదే సమయంలో 75 శాతం కంటే ఎక్కువ మ్యాచ్ లలో రిజర్వ్ బెంచ్ లో ఉన్నవారికి మ్యాచ్ కు రూ.22.5 లక్షల చొప్పన లభిస్తాయి. 

ఈ స్కీమ్ కోసం ఓ సీజన్ లో 9 టెస్టులను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇందులో నాలుగు టెస్టుల కంటే తక్కువ ఆడిన వారికి మ్యాచ్ ఫీజు తప్ప ఎలాంటి ప్రోత్సాహక నగదు ఇవ్వరు. 5-6 టెస్టులు ఆడితే 50 శాతం కంటే ఎక్కువ ఆడినట్టు... 7 అంతకంటే ఎక్కువ టెస్టులు ఆడితే 75 శాతం కంటే ఎక్కువ ఆడినట్టు అని బీసీసీఐ వివరించింది. ఈ పథకాన్ని 2022-23 సీజన్ నుంచి వర్తింపజేస్తున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.
BCCI
Test Cricket Incentive Scheme
Cricketers
Test Cricket
Team India

More Telugu News