Sachin Tendulkar: రియల్ 'లెగ్' స్పిన్నర్ అంటే ఇతడే: సచిన్

Sachin describes para cricketer Amir Lone a real leg spinner
  • భారత్ లో ఐఎస్ పీఎల్ ప్రారంభం
  • ప్రారంభోత్సవానికి హాజరైన సచిన్
  • పారా క్రికెటర్ అమీర్ తో బ్యాటింగ్, బౌలింగ్ చేయించిన సచిన్
భారత్ లో మొదటిసారిగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్ పీఎల్) పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీని భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఈ టోర్నీలో తొలి బంతిని ఆడేందుకు సచిన్ కశ్మీర్ పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్ ను ఆహ్వానించారు. 

రెండు చేతులు లేని అమీర్ మెడతో బ్యాట్ ను పట్టుకుని ఆడగలడు. అంతేకాదు, కాలితో బంతిని పట్టుకుని బౌలింగ్ చేస్తాడు. ఈ సందర్భంగా అమీర్ తో బ్యాటింగ్ చేయించిన సచిన్... ఆ తర్వాత అతడు కాలితో బౌలింగ్ చేస్తుంటే చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సచిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

రియల్ 'లెగ్' స్పిన్నర్ అంటే అమీరేనంటూ స్పందించారు. ప్రతికూల పరిస్థితులను ధిక్కరిస్తూ అతడు ప్రతి బంతి విసిరాడని కొనియాడారు. అమీర్... నువ్వు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని ప్రశంసించారు.
అమీర్ జమ్మూకశ్మీర్ లోని బిజ్ బెహారా ప్రాంతానికి చెందినవాడు. 1990లో జన్మించిన అమీర్ 8 ఏళ్ల వయసులో ప్రమాదానికి గురయ్యాడు. తండ్రికి చెందిన రంపపు మిల్లులో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు అతడి రెండు చేతులు తెగిపోయాయి. ఆ తర్వాత క్రికెట్ పై ఆసక్తి పెంచుకున్న అమిర్ రెండు చేతులు లేకపోయినప్పటికీ మెడతో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేయడం, కాలితో బౌలింగ్ చేయడం ప్రాక్టీసు చేసి ఔరా అనిపించాడు. 

ఇటీవల కశ్మీర్ లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన  సచిన్... అమీర్ ను కలిసి ముగ్ధుడయ్యారు. తన ఆటోగ్రాఫ్ తో కూడిన బ్యాట్ ను అతడికి బహూకరించారు.
Sachin Tendulkar
Amir Lone
Leg Spinner
Para Cricketer
Jammu And Kashmir
ISPL

More Telugu News