Captain Prashant Nair: గగన్‌యాన్ వ్యోమగామి ప్రశాంత్ నాయర్‌ని పెళ్లి చేసుకున్న మలయాళ సినీ నటి లీనా

Malayalam actress Leena announces that she married to Gaganyan astronaut Captain Prashant Nair
  • జనవరి 17న సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగిందని తెలిపిన లీనా
  • ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించిన మలయాళ నటి
  • గగన్‌యాన్ మిషన్ వ్యోమగాముల్లో ఒకరుగా ఉన్న కెప్టెన్ ప్రశాంత్ నాయర్
భారత్ చేపడుతున్న మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌ మిషన్’లో భాగంగా అంతరిక్షానికి ప్రయాణించనున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరైన కెప్టెన్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌‌ను తాను పెళ్లి చేసుకున్నట్టు మలయాళ నటి లీనా ప్రకటించారు. జనవరి 17, 2024న వివాహం జరిగిందని, సంప్రదాయ పద్ధతిలో తాము ఒక్కటయ్యామని ‘ఇన్‌స్టాగ్రామ్’ వేదికగా మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 

‘‘ఈరోజు (ఫిబ్రవరి 27) దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారత వైమానిక దళ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ వ్యోమగామి ‘వింగ్స్’ను అందజేశారు. ఈ చారిత్రాత్మక క్షణం దేశానికి, కేరళ రాష్ట్రానికి, వ్యక్తిగతంగా నాకు గర్వించదగింది. అధికారికంగా గోప్యత పాటించాల్సి ఉన్నందున మా పెళ్లి గురించి ప్రకటించలేదు. జనవరి 17, 2024న సంప్రదాయ పద్ధతిలో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నామని మీకు తెలియజేయడానికి ఈ క్షణం వరకు ఎదురుచూశాను’’ అని ఆమె ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చారు.

కాగా కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ కేరళలోని పాలక్కడ్‌కు చెందినవారు. ఇక నటి లీనా జయరాజ్ పలు సినిమాల్లో నటించారు. 'స్నేహం' మూవీ ద్వారా ఆమె మలయాళ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 'కరుణం', ‘దేవదూతన్‌’, ‘ఇంద్రియమ్‌’, ‘కోచ్‌ కోచ్‌ సంతోష్‌మాన్‌’, ‘శాంతం’ వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న లీనా తిరిగి ఈ మధ్య పలు పాత్రల్లో నటిస్తున్నారు. ఆమె పలు సీరియల్స్‌లోనూ నటించడం గమనార్హం.
Captain Prashant Nair
Leena Jayaraj
Malayalam
Mission Gaganyaan

More Telugu News